Premalu: ‘ప్రేమలు 2’ ఫిక్స్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

Published : 20 Apr 2024 00:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘ప్రేమలు’ (Premalu). గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ మార్చిలో విడుదల చేసి సక్సెస్‌ను అందుకున్నారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. 2025లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. థియేటర్లలో అలరించిన ప్రేమలు.. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

‘ప్రేమలు’పై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రేమలు మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు కార్తికేయకు కృతజ్ఞతలు. బాగా ఎంజాయ్‌ చేశాను. సినిమా చూస్తూ ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా కుటుంబం మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్‌ అందరూ అద్భుతంగా నటించారు. మొత్తం టీమ్‌కు నా అభినందనలు’’ అని మహేశ్‌ బాబు దీనిపై రివ్యూ ఇవ్వగా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నట్లు రాజమౌళి చెప్పారు. మలయాళీ నటులంతా చక్కగా నటించారని ప్రశంసించారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన మమిత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని