The Goat Life: బాక్సాఫీస్‌ వద్ద రూ.కోట్లు కొల్లగొడుతోన్న ‘ఆడు జీవితం’.. వసూళ్లు ఎంతంటే..?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

Published : 06 Apr 2024 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళీ చిత్ర దర్శకుడు బ్లెస్సీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఆడు జీవితం’ (Aadujeevitham). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టిందని శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తమ చిత్ర బృందానికి అపూర్వ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ధన్యవాదాలు చెప్పారు.

కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) ‘గోట్ డేస్’ నవల రచించారు. విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఈ నవలను బ్లెస్సీ ‘ఆడు జీవితం’గా సినిమా రూపంలో తెరకెక్కించారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. రూ.82 కోట్లతో ఇది నిర్మితమైనట్లు అంచనా. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్‌ ఎంతో శ్రమించారు. కీలక సన్నివేశాల కోసం 31 కిలోల బరువు తగ్గారు. 72 గంటల పాటు భోజనం లేకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఆయన షూట్‌లో పాల్గొన్న సందర్భాలున్నాయి.

కథేంటంటే: నజీబ్ మహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్) (Prithviraj Sukumaran) ఉపాధి కోసమ‌ని త‌న స్నేహితుడు హ‌కీం (కేఆర్ గోకుల్‌)తో క‌లిసి సౌదీ వెళ్తాడు. ఏజెంట్ చేసిన మోసం కార‌ణంగా అనుకున్న ఉద్యోగం దొర‌క్క‌పోగా, బ‌ల‌వంతంగా గొర్రెల్ని కాయ‌డం కోసం తీసుకెళ‌తాడు య‌జ‌మాని. వెళ్లిన ఇద్ద‌రినీ వేర్వేరు చోట్ల వ‌దిలిపెడ‌తాడు. భాష తెలియ‌క, ఎడారి మ‌ధ్య‌లో స‌రైన తిండి, నీళ్లు లేక, య‌జ‌మానుల వేధింపుల‌తో ఎన్నో అవ‌స్థ‌లు ప‌డ‌తాడు న‌జీబ్‌. అక్క‌డి నుంచి త‌ప్పించుకుని తిరిగి వెళ్లిపోవాల‌నుకున్న అతడు ఏం చేశాడు? త‌న‌తోపాటు వ‌చ్చిన హ‌కీంని క‌లిశాడా? త‌న కుటుంబాన్ని మ‌ళ్లీ క‌లుసుకున్నాడా?(Aadujeevitham) త‌దిత‌ర విష‌యాలతో ఇది రూపుదిద్దుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని