Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్‌

Aadujeevitham: పృథ్వీరాజ్‌ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్‌ విశేషాలను ఆయన పంచుకున్నారు.

Published : 21 Mar 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే అతికొద్ది మందిలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఒకరు. ఆయన కీలక పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’ (Aadujeevitham). అత్యంత సుదీర్ఘ కాలం షూటింగ్‌ జరుపుకొన్న ఈ మూవీ మార్చి 28న మలయాళంతో పాటు తెలుగులోనూ రాబోతోంది. ఈసందర్భంగా షూటింగ్‌ విశేషాలతో పాటు, ఆ పాత్ర కోసం తాను పడిన కష్టాన్ని పంచుకున్నారు.

‘‘ఎడారిలో దారి తప్పిపోయి ఆకలితో అలమటించే వ్యక్తిగా కనిపించాలంటే నేను కూడా భోజనం మానేయాలనుకున్నా. ఆహారాన్ని కోసం రోజుల పాటు వేచి చూసిన వ్యక్తి ఎలా కనిపిస్తాడో అలాగే నేనూ కనపడాలనుకున్నా. దీంతో ఎక్కువ సమయం ఉపవాసం ఉండేవాడిని. కొన్నిసార్లు 72 గంటల పాటు కేవలం మంచినీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగేవాడిని. శారీరకంగా ఈ మార్పు రావాలంటే కేవలం ఆహారం మానేస్తే సరిపోదు. మానసికంగానూ అందుకు సిద్ధంగా ఉండాలి. మనిషి శరీరం రెండు, మూడు రోజులు పాటు ఆహారం తీసుకోకపోయినా నిలబడుతుంది. కానీ, రెండో రోజు నుంచే ఏదైనా తినమంటూ మన మెదడు చెబుతూ ఉంటుంది. ఇది అసలైన ఛాలెంజ్‌. నాకు సాధ్యమైనంత వరకూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాం. ఎంతలా అంటే ఈ సినిమా కోసం ఏకంగా 31 కేజీలు తగ్గిపోయా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పృథ్వీరాజ్‌ నజీబ్‌ అనే యువకుడిగా కనిపించనున్నారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్న అంశాలను ఇందులో చూపించనున్నారు. దాదాపు పదేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్‌ జరుపుకోవడం విశేషం.

‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ అప్‌డేట్‌

మోహన్‌లాల్‌ (Mohanlal) కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎల్‌2: ఎంపురాన్‌’ గురించి కూడా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌గా ఇది రాబోతోంది. రాజకీయాల్లోకి రాకముందు స్టీఫెన్‌ గట్టుపల్లి (మోహన్‌లాల్‌) ఏం చేసేవాడు? ఖురేషి అబ్రహంగా ప్రపంచ మాఫియాను ఎలా శాసించాడు? అన్న విషయాలను ఇందులో చూపించనున్నారు. పృథ్వీరాజ్‌ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ను యూకేలో పూర్తి చేశా. 20శాతం మూవీ షూటింగ్‌ అయిపోయింది. ఇంకొన్ని సీన్స్‌ యూఎస్‌లో తీయాలి. అలాగే, యూఏఈ, ఇండియాలోనూ కొన్ని సీన్లు తీయాలి’ అని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని