Aadujeevitham: ప్రభాస్‌ సినిమాను డైరెక్ట్‌ చేస్తా: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

ప్రభాస్‌ హీరోగా సినిమా తెరకెక్కించాలనుందన్నారు పృథ్వీరాజ్‌.

Updated : 24 Mar 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ‘ఆడుజీవితం’(Aadujeevitham) చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను బ్లెస్సీ తెరకెక్కించారు. మార్చి 28న విడుదల కానుంది.  హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ ‘‘మంచి కథ కుదిరితే టాలీవుడ్‌లోనూ హీరోగా నటిస్తా. దర్శకుడిగా చేయాల్సి వస్తే ప్రభాస్‌తో సినిమా చేస్తా. ఆయన చాలా మంచి వ్యక్తి. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఎప్పుడూ గర్వం చూపించలేదు. అందిరితో చాలా ప్రేమగా మాట్లాడుతారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది’’ అని అన్నారు. ‘సలార్‌’ చిత్రంలో స్నేహితులుగా వీరిద్దరి చిన్నప్పటి సన్నివేశాలతో క్రియేట్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘‘వరద రాజమన్నార్‌గా మీ ముందుకు వచ్చాను. అది ప్రశాంత్‌ నీల్‌ సృష్టించిన పాత్ర.  ‘ఆడుజీవితం’(Aadujeevitham) అలా కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ జీవితాన్ని వివరిస్తూ బెన్యామిన్‌ అనే రచయిత రాసిన పుస్తకాన్ని సినిమా రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. బడ్జెట్‌ అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది. ప్రేక్షకులకు మంచి సినిమా అందిచాలని రిస్క్‌ చేశాం. ఎడారిలో దారి తప్పి ఆకలితో అలమటించే వ్యక్తి సహజంగా ఎలా కనిపిస్తాడో నేను అలా కనపడాలనుకున్నా. ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగిన నేను.. ఆ తర్వాత 31 కిలోలు తగ్గాల్సి వచ్చింది. 72 గంటలపాటు కేవలం మంచినీళ్లు, బ్లాక్‌కాఫీ మాత్రమే తాగేవాడిని. వీటితో పాటు చిత్రీకరణ దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. 2008లో మొదలైన ఆలోచన ఎన్నో అవాంతరాలను దాటుకొని మీ ముందుకు రానుంది’’ అని పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని