Priyamani: చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి

జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు.

Published : 28 Mar 2024 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు నటి ప్రియమణి (Priyamani). ఇటీవలే ‘ఆర్టికల్‌ 370’ (Article 370)తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఆమె.. మరికొన్ని రోజుల్లో ‘మైదాన్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన నటనను మెరుగుపరుచుకోవడానికి స్వీయవిమర్శ చేసుకుంటున్నట్లు తెలిపారు.

‘సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఎలాంటి పాత్రలనైనా ఎంచుకునేదాన్ని. కొన్ని సన్నివేశాలు తెరపై చూసినప్పుడు ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేదని నాకే అనిపించేది. కొత్తగా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే నేను కథలను ఎంపిక చేసుకునే విధానం మారింది. సినిమాలపై స్పష్టత వచ్చింది. పాట చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పు కాదని తెలుసుకున్నా. సినిమాలకు సంబంధించి చాలా విషయాల్లో నా ఆలోచన మారింది’ అన్నారు. అలాగే, బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌ గురించి మాట్లాడుతూ ఆయనొక అద్భుతమన్నారు. ‘ఆయనది చాలా భిన్నమైన మనస్తత్వం. తెలివైన నటుడు. తన కళ్లతో మాట్లాడగలరు. ఎమోషనల్‌ సన్నివేశాలు చిత్రీకరించినప్పుడల్లా.. కళ్లతో హావభావాలు పలికించేవారు. ‘మైదాన్‌’లో తన పాత్రకు జీవం పోశారు. తెరపై చూసి మీరు ఆశ్చర్యపోతారు’ అని తెలిపారు.

‘మైదాన్‌’ విషయానికొస్తే..  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా అమిత్‌శర్మ దీనిని తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.    ఈద్‌ కానుకగా ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని