Dil Raju: విజయ్‌ను స్టార్‌గా చూపించేందుకు కాదు: ఆ టైటిల్‌పై దిల్‌ రాజు వివరణ

తాను నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ టైటిల్‌ ఎందుకు పెట్టారో నిర్మాత దిల్‌ రాజు తెలిపారు.

Published : 23 Mar 2024 00:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తాను నిర్మిస్తున్న చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) వెల్లడించారు.  కొందరు భావించినట్లుగా విజయ్‌ని స్టార్‌గా చూపించేందుకు కాదని స్పష్టం చేశారు. ‘తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌’ హైదరాబాద్‌లో శుక్రవారం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘‘ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తూ తమ కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చే వారంతా ఫ్యామిలీ స్టార్లే. ఈ సినిమా కథాంశం అదే.. అందుకే ఆ పేరు పెట్టాం. మా నిర్మాణ సంస్థ నుంచి గతంలో వచ్చిన ఫ్యామిలీ చిత్రాలకు ఓ బ్రాండ్‌ ఏర్పడింది. ‘ఫ్యామిలీ స్టార్‌’ కూడా అలానే ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి పాల్గొన్నారు.

విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘జర్నలిస్టుల హెల్త్‌కార్డుల పంపిణీ, డైరీ విడుదల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కాలేజీ రోజుల్లో ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయనే ఉద్దేశంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేవాణ్ని. ప్రీమియం చెల్లించలేక పాత బీమాని వదిలేయడం, మళ్లీ కొత్త పాలసీ తీసుకోవడం ఇదే నా పని. ఆరోగ్యం, ఆనందం, ధనం.. ఈ మూడే జీవితంలో ముఖ్యమని భావిస్తా’’ అని అన్నారు.

మీడియా చాలా పవర్‌ఫుల్‌ అని నారాయణమూర్తి పేర్కొన్నారు. సినీ పత్రికల ప్రస్థానాన్ని, ప్రముఖ సినీ జర్నలిస్టులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు సినిమా విడుదలైన వారానికి రివ్యూ ఇచ్చేవారని, ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందే విశ్లేషణ చేస్తున్నారని అన్నారు. మూవీ రిలీజైన మూడు రోజుల తర్వాత రివ్యూ ఇవ్వాలని, సినీ నటుల వ్యక్తిగత జీవితం గురించి అవాస్తలు ప్రచారం చేయొద్దని, పెద్ద సినిమాలే కాకుండా చిన్న చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా చేయాలని సినీ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. విజయ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’లో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని