Vikramarkudu 2: ‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్స్ అప్‌డేట్‌.. ఎంతవరకు వచ్చాయంటే!

రెండు హిట్‌ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్‌ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందన్నారు. 

Published : 19 Apr 2024 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని చిత్రాలు ఎన్ని సంవత్సరాలైనా ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. అలాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల సీక్వెల్స్‌ కోసం సినీప్రియులు ఎదురుచూస్తుంటారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ ఈ కోవకు చెందినదే. రవితేజ హీరోగా దర్శక ధీరుడు తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సీక్వెల్‌ రానుందని చాలారోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా నిర్మాత రాధామోహన్‌ దీనిపై అప్‌డేట్‌ ఇచ్చారు. దీనితో పాటు బాలీవుడ్‌ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటైన ‘బజరంగీ భాయిజాన్‌’ పార్ట్‌ 2 గురించి కూడా ఆయన మాట్లాడారు.

‘రచయిత విజయేంద్రప్రసాద్‌ రెండు కథలు సిద్ధం చేశారు. ‘విక్రమార్కుడు 2’, ‘బజరంగీ భాయిజాన్‌ 2’ ఈ రెండు సినిమాల స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయి. క్యాస్టింగ్‌ ఓకే అయితే వెంటనే మొదలుపెడతాం. ‘బజరంగీ భాయిజాన్‌ 2’ కథ సల్మాన్‌ఖాన్‌కు వినిపించే సమయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని చెప్పారు. దీంతో ఈ సూపర్‌హిట్‌ చిత్రాల సీక్వెల్స్‌ త్వరలోనే రానున్నట్లు ఖాయమైంది. ‘విక్రమార్కుడు 2’కు కూడా రాజమౌళినే దర్శకత్వం వహించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇటీవల రవితేజ ఈ సీక్వెల్‌ (Vikramarkudu 2) గురించి మాట్లాడుతూ.. రాజమౌళితో కలిసి పని చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. భారతీయ సినీ పరిశ్రమలోని వారందరూ ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారని తెలిపారు.

ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ‘రౌడీ రాథోడ్‌’గా రీమేక్‌ చేశారు. దానికి ప్రభుదేవ దర్శకత్వం వహించగా.. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించారు. అక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్‌ ‘రౌడీ రాథోడ్‌-2’ కోసం బీటౌన్‌ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని