Vamsi Karumanchi: నిర్మాణంలో అదే పెద్ద సవాల్‌

‘‘ఆనంద్‌ దేవరకొండ గత చిత్రం ‘బేబీ’కి పూర్తి భిన్నంగా..హాస్యం ప్రధానంగా ‘గం గం గణేశా’ తెరకెక్కింది. తను మరో కొత్త రకమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరిస్తాడ’’ని చెప్పారు వంశీ కారుమంచి. ఆయన కేదార్‌ సెలగం శెట్టితో కలిసి నిర్మించిన చిత్రమే.. ‘గం గం గణేశా’.

Published : 28 May 2024 01:18 IST

‘‘ఆనంద్‌ దేవరకొండ గత చిత్రం ‘బేబీ’కి పూర్తి భిన్నంగా..హాస్యం ప్రధానంగా ‘గం గం గణేశా’ తెరకెక్కింది. తను మరో కొత్త రకమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరిస్తాడ’’ని చెప్పారు వంశీ కారుమంచి. ఆయన కేదార్‌ సెలగం శెట్టితో కలిసి నిర్మించిన చిత్రమే.. ‘గం గం గణేశా’. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వంశీ కారుమంచి సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘గణేశ్‌ విగ్రహం చుట్టూ సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వినాయక చవితికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఆనంద్‌కి కొత్తగా ఉంటుందని నమ్మి ఆయనకి ఈ కథ చెప్పాం. ఆయనా ఇప్పటిదాకా చేయని కథ అని వెంటనే ఒప్పుకున్నారు. జులాయి తరహా పాత్రలో కనిపిస్తాడు. స్నేహితుల్లో కొంతమంది చేసే కొన్ని పనులు గమ్మత్తైన సమస్యల్ని సృష్టిస్తుంటాయి. వాటి గురించి వినేవాళ్లకి కామెడీగా అనిపిస్తుంటాయి. అలాంటి కథతోనే ఈ చిత్రం రూపొందింది. ఆనంద్‌తోపాటు, జబర్దస్త్‌ ఇమ్మానుయేల్, నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి నటనని ప్రదర్శించారు. ‘బేబీ’ తర్వాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం మాకు చాలా రకాలుగా ప్రయోజనకరంగా ఉంది. అదే సమయంలో కొన్ని భయాలూ ఉన్నాయి. ఆనంద్‌ అనగానే ‘బేబీ’ సినిమానే గుర్తు చేస్తున్నారు. అన్ని సినిమాలూ ‘బేబీ’ కావు, అది ప్రేమకథ, ఇది యాక్షన్‌తో కూడిన కామెడీ కథ అంటూ ప్రచారం చేస్తున్నాం’’. 

‘‘విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ నాకు మంచి మిత్రులు. ఆ అనుబంధంతోనే ఆనంద్‌తో ఈ సినిమా చేశాం. అమెరికాలో ఐటీ వ్యాపారం మా నేపథ్యం. గుంటూరు మా సొంతూరు. సినిమా అంటే చిన్నప్పటి  నుంచీ ఇష్టం. ఇక్కడైనా, అమెరికాలో అయినా తొలి రోజు తొలి ఆట బ్యాచ్‌ మాది. ఆ ఇష్టంతోనే ఎప్పటికైనా సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నాం. కరోనా సమయంలో అమెరికా నుంచి వచ్చి ఇక్కడే ఆగిపోయాం. అప్పుడే నిర్మాణంలోకి అడుగుపెట్టి ఈ సినిమా చేశా. సినిమా పరిశ్రమ చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ, చాలా పెద్దది. ఇతర చాలా రంగాలు చిత్ర పరిశ్రమతో ముడిపడి ఉంటాయి. చాలా క్లిష్టమైన రంగం. ఇక్కడ సృజనాత్మకతని కచ్చితంగా అంచనా వేయడం ఓ పెద్ద సవాల్‌. బడ్జెట్‌ పరంగానూ, సృజనాత్మకంగానూ తొలి సినిమా ఎన్నో అనుభవాల్ని పంచింది. ఆ అనుభవం భవిష్యత్తు సినిమాలకి ఉపయోగపడుతుంది. ఇకపై కూడా సినిమాలు చేస్తూనే ఉంటాం.  నా అభిమాన కథానాయకుడు బాలకృష్ణ. ఆయనతో సినిమా చేయాలనేది నా కల. ఆ అవకాశం వస్తే అదొక వరంలా భావిస్తా. ప్రస్తుతం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథపై చర్చలు జరుగుతున్నాయి. రెండు మూడు నెలల్లో ఆ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతాం’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు