Pushpa: పుష్ప పాట నాకు ప్రత్యేకం

‘‘తెలుగుతోపాటు...  తమిళంలోనూ పాడిన పుష్ప పాట నా కెరీర్‌కు ఎంతో ప్రత్యేకం. శక్తిమంతమైన పదాలతో కూడిన ఈ పాట పాడే అవకాశం నాకు రావడం ఎంతో తృప్తినిచ్చింది’’ అన్నారు  దీపక్‌ బ్లూ.

Published : 23 May 2024 06:03 IST

‘‘తెలుగుతోపాటు...  తమిళంలోనూ పాడిన పుష్ప పాట నా కెరీర్‌కు ఎంతో ప్రత్యేకం. శక్తిమంతమైన పదాలతో కూడిన ఈ పాట పాడే అవకాశం నాకు రావడం ఎంతో తృప్తినిచ్చింది’’ అన్నారు  దీపక్‌ బ్లూ. తెలుగువాడైన దీపక్‌... తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 300కిపైగా పాటలు పాడారు. తెలుగులో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ‘లవ్‌ దెబ్బ...’, ‘బ్రూస్‌లీ’లోని ‘మెగా మీటర్‌...’ సహా ఎన్నో పాటలు పాడారు. ఇటీవల ‘పుష్ప2’లో ‘పుష్ప పుష్ప పుష్ప... ’అంటూ సాగే పాటని నకాష్‌ అజీజ్‌తో కలిసి ఆలపించారు. ఈ సందర్భంగా దీపక్‌ బ్లూ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... 

‘‘2012 నుంచి నా పాటల ప్రయాణం మొదలైంది. విజయ్‌ ఆంటోనీ ‘నకిలీ’ సినిమాతో తొలి అవకాశం ఇచ్చారు. 2015, 16లో తెలుగులో చాలా పాటలు పాడాను. తమన్‌ సంగీత దర్శకత్వంలో ‘బీరువా’ మొదలుకొని ‘వారసుడు’ వరకూ 35కిపైగా పాటలు పాడాను. దేవిశ్రీప్రసాద్‌ సర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మొదలుకొని పలు సినిమాల్లో పాడాను.  నేను చెన్నైలో ఉండటం, అక్కడే రికార్డింగ్స్‌లో పాల్గొనడంతో తెలుగులో విజయవంతమైన పాటలు పాడినా, నా పేరు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ‘పుష్ప2’ కోసం దేవిశ్రీప్రసాద్‌ సర్‌ నన్ను పిలిచి ‘పుష్ప పుష్ప పుష్ప...’ పాట పాడించారు. తెలుగుతోపాటు,  తమిళంలోనూ పాడిన ఈ పాట  ఓ గాయకుడిగా నాకెంతో తృప్తినిచ్చింది. మా సొంతూరు రేపల్లె. మా నాన్న తన బాల్యంలోనే చెన్నై వచ్చి స్థిరపడ్డారు. మా అమ్మ, అమ్మమ్మల ప్రభావం నన్ను సంగీత ప్రపంచంపై దృష్టిపెట్టేలా చేసింది. నా భార్య వీణ కూడా నేపథ్య గాయని’’. 

‘‘నా అసలు పేరు దీపక్‌ సుబ్రహ్మణ్యం కప్పగంతుల. దీపక్‌ పేరుతోనే 2019 వరకూ పాడాను. అప్పటివరకూ ఆపేరుతో ఉన్న గాయకుడిని నేనొక్కడినే. కానీ ఆ తర్వాత భోజ్‌పురిలోనూ దీపక్‌ అనే ఓ గాయకుడు వచ్చాడు. పేరు విషయంలో గందరగోళం ఉండకూడదని నాకు ఇష్టమైన బ్లూ రంగుని నా పేరుకి జోడించాను. గాయకుల మధ్య పోటీ పెరిగింది. అదే సమయంలో పాటలు తగ్గిపోతున్నాయి. ఇదివరకు ఒకొక్క సినిమాలో  ఐదారు పాటలు ఉండేవి. ఒకొక్క పాట ఐదు నిమిషాలు వినిపించేది. కానీ ఇప్పుడు మూడు పాటలంటే ఎక్కువ. అది కూడా మూడు నిమిషాల్లోనే ముగిసిపోతున్నాయి. ఆ మూడు పాటల్నీ ఒకటి సంగీత దర్శకుడు, మరొకటి హీరో పాడేస్తుంటారు. మిగిలిన ఓ పాట కోసం మేం పోటీ పడుతుంటాం (నవ్వుతూ). కానీ అదొక పార్శ్వం మాత్రమే. పాన్‌ ఇండియా ట్రెండ్‌ వల్ల పలు భాషల్లో పాటలు పాడే అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ సినిమా నిండుగా పాటలు వినిపించే రోజులు తప్పకుండా వస్తాయి. నా అభిమాన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. యేసుదాస్‌ గాత్రంలోని అనుభూతి, శంకర మహదేవన్‌లోని ఉత్సాహం నాకు స్ఫూర్తి’’.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని