PVR Inox: ‘నో యాడ్స్‌..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్‌ ఐనాక్స్‌ నిర్ణయం

పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్‌ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.

Published : 25 Apr 2024 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూసేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచేందుకు పీవీఆర్‌ ఐనాక్స్‌ (PVR Inox) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షోలు ప్రారంభానికి ముందు ప్రదర్శించే వాణిజ్య ప్రకటనలను పలు నగరాల్లోని లగ్జరీ మల్టీప్లెక్స్‌ల్లో ఇప్పటికే రద్దు చేసిన ఆ సంస్థ మరికొన్ని చోట్లా అదే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. దాదాపు 35 నిమిషాల యాడ్‌ స్లాట్‌ను 10 నిమిషాలకు కుదించి, అదనపు షోస్‌ వేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇంటర్వెల్‌లోనూ ప్రేక్షకులు యాడ్స్‌ను చూసేందుకు ఇష్టపడట్లేదని, త్వరలో విడుదల కాబోయే చిత్రాల ట్రైలర్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ ‘ది లగ్జరీ కలెక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌’ చీఫ్‌ రెనాడ్‌ పలియెర్‌ తెలిపారు. పలువురు ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని, ‘యాడ్‌ ఫ్రీ’ (ad free movies) విధానం తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.

‘‘ప్రకటనలను ప్రదర్శించే సమయాన్ని తగ్గించడం వల్ల సినిమా షోల సంఖ్య పెంచుకునే వీలుంటుంది. యాడ్స్‌ లేకపోవడం వల్ల నష్టం వాటిల్లుతుంది. కానీ, అదనపు షోల వల్ల వచ్చే ప్రేక్షకులు కొనే టికెట్లతో ఆ నష్టాన్ని భర్తీ చేయొచ్చు. సినిమాలు ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు కొత్త చిత్రాల ట్రైలర్లను ప్రదర్శిస్తాం. రెండు/మూడు ప్రముఖ బ్రాండ్‌ల యాడ్స్‌ కూడా అందులో భాగంగానే ఉంటాయి. యాడ్‌ ఫ్రీ విధానం దిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర మల్టీప్లెక్స్‌ చైన్‌ (డైరెక్టర్స్‌ కట్‌, ఇన్సిగ్నియా)లో అమల్లో ఉంది. త్వరలోనే పుణెలో ప్రారంభిస్తాం. కొన్ని నెలల్లో మరికొన్ని చోట్ల అమలుచేయనున్నాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని