Raghavendra Rao: ‘సీతారామం’.. ఆమెను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి: రాఘవేంద్రరావు

సంతోష్‌ శోభన్‌ (Santosh Soban), మాళవికా నాయర్‌ (Malvika Nair) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). తాజాగా ఈసినిమా నుంచి కొత్త పాట విడుదలైంది. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Updated : 08 May 2023 16:51 IST

హైదరాబాద్‌: దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతారామం’ (Sita Ramam) సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao). సీతను తలచుకుంటే ఇప్పటికీ తనకు కన్నీళ్లు వస్తాయని ఆయన అన్నారు. ‘సీతారామం’ నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంక దత్‌ నిర్మించిన సరికొత్త చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) లోని ఓ పాట విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సీతారామం-2’ (SitaRamam 2) ప్లాన్‌ చేయాలంటూ స్వప్నకు సూచించారు.

‘‘సంతోష్‌ శోభన్‌, మాళవికా నాయర్‌ కాంబినేషన్‌ బాగుంది. నందిని, స్వప్న, ప్రియాంక.. ఈ ముగ్గురూ ప్లాన్‌ చేసి.. మా ముగ్గురు స్నేహితులను (రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌) ఈ పాట విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. దత్‌గారి బ్యానర్‌లో నేను సుమారు 14 సినిమాలు చేశాను. దాదాపు అన్నీ హిట్‌ అందుకున్నాయి. ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలోని ‘చేయి చేయి కలిపేద్దాం’ పాటను చూస్తుంటే నా ‘పెళ్లి సందడి’లోని పాట చూసినంత ఆనందంగా ఉంది. ‘పెళ్లి సందడి’ ఎంతటి విజయాన్ని అందుకుందో ఈ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. స్వప్నా.. ఇప్పటికీ ‘సీతారామం’ మర్చిపోలేను. ఆ సినిమా తర్వాత మీ నుంచి వస్తోన్న ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నా. ఇక, నాకు ఒక్కటే బాధ ఉండిపోయింది. (సీతారామం చిత్రాన్ని ఉద్దేశిస్తూ) సీత ఏమైంది? సీత జీవితాన్ని అలా మిగల్చడం చాలా బాధగా ఉంది. నేను ఒక ఐడియా చెబుతా మీ దర్శకుడికి చెప్పు. రామ్‌ కోసం ఎంతో బాధపడుతున్న సీత ఒక తుపాకీ తీసుకుని విలన్‌ వద్దకు వెళ్లి.. అతడిని కాల్చాలనుకుంటుంది. అప్పుడు ఆమెకు రామ్‌ చావలేదని తెలుస్తుంది. అలా, రామ్‌-సీత అక్కడి నుంచి తప్పించుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాక..  కుటుంబసభ్యులు వాళ్లను ఎలా ఇబ్బందులు పెట్టారు? ఇలా చూపిస్తే బాగుంటుంది. పాపం, ఆ సీతను అలా ఉంచొద్దు. ఆమెను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తుంటాయి’’ అని రాఘవేంద్రరావు వివరించారు.

అనంతరం అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘30 ఏళ్లుగా మేము మంచి స్నేహితులం. ఇప్పటికీ మేము కలిస్తే ఎంతో సరదాగా మాట్లాడుకుంటాం. స్వప్న, ప్రియాంక నాకు కూతుళ్లతో సమానం. నందినిరెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు. ఇక, చిన్న ప్రాజెక్ట్‌కు కూడా ఎక్కువ ఖర్చుపెట్టడం అశ్వినీదత్‌కే చెల్లుతుంది. ‘మహానటి’ నిర్మాణ వ్యయం తెలుసుకుని ఆయన్ని తిట్టాను. ‘ఎందుకంత ఖర్చుపెట్టావు?’ అని కోప్పడ్డాను. ఆ తర్వాత ప్రాజెక్ట్‌కు కూడా ఆయన అలాగే చేశారు. అన్నీ మంచి లాభాలే తెచ్చిపెట్టాయి. దీనికి కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టారని తెలుసు. ఇది కూడా వందశాతం లాభాలే తెచ్చిపెడుతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి హాయిని ఇస్తుందని నమ్ముతున్నా. నందినికి మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నా’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు