RC17: రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాపై రాజమౌళి కామెంట్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు.   

Updated : 26 Mar 2024 11:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి (SS Rajamouli) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు RC17 గురించి చెప్పారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. 

మరోవైపు ఈ చిత్రంపై రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్‌ చరణ్‌ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు. 

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్‌ హిట్‌ కావడంతో RC17పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రాజమౌళి, కార్తికేయల కామెంట్స్‌తో అవి పెరిగాయి. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించనున్నారు. ఈ ఏడాదిలోనే చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది ఆఖర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని