Rajinikanth: రజనీకాంత్‌కు గోల్డెన్‌ వీసా.. ఆయనకు స్పెషల్‌ థాంక్స్‌!

ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్‌ వీసా లభించింది. దానిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 23 May 2024 23:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసా ( UAE Golden Visa)ను అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా రజనీకాంత్‌ (Rajinikanth) చేరారు. వీసా పొందిన అనంతరం  సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాన్నో గౌరవంగా భావిస్తున్నానన్నారు. యూఏఈ ప్రభుత్వానికి, తన స్నేహితుడు, లులూ గ్రూప్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూసఫ్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుక్‌ ఖాన్‌, అల్లు అర్జున్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, టొవినో థామస్‌ తదితరులకు ఈ వీసా లభించింది.

‘జైలర్‌’తో మంచి విజయాన్ని అందుకున్న రజనీకాంత్‌ ప్రస్తుతం ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. ఆయనకు ఇది 170వ చిత్రం. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని