Rakul Preet Singh: రకుల్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

రకుల్‌, జాకీ భగ్నానీల వివాహానికి సంబంధించిన తేదీ ఖరారైంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది.

Updated : 12 Feb 2024 16:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh). త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతున్నారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రకుల్‌-జాకీల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

రకుల్-జాకీ తమ పెళ్లికి డిజైనర్లను కూడా లాక్‌ చేశారు. మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుక జరగనుంది. రోజుకొక డిజైనర్ తయారుచేసిన దుస్తుల్ని వీళ్లు ధరించబోతున్నారట. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్ చేశారు. తొలుత వీరి వివాహాన్ని మిడిల్‌ ఈస్ట్‌లో చేయాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రదేశాలను సెలక్ట్‌ చేశారు. అయితే, గత డిసెంబరులో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

‘మహిళ ఎప్పటికైనా తాను పుట్టిన ఇంటిని వీడి మరొక ఇంటికి వెళ్లాల్సిందే. ప్రపంచం ఇలాగే నడుస్తోంది. దీన్ని మనం మార్చలేం. మార్పును అంగీకరించాలి... స్వాగతించాలి.  మన ఆలోచనా విధానం ఎంత సానుకూలంగా ఉంటే అంత మంచిది’ అంటూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని రకుల్‌ చెప్పుకొచ్చింది.

‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో నటిగా రకుల్‌ ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆమె నటించిన ‘అయలాన్‌’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లోనే ఆమె ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని