Ram charan: డాక్టరేట్‌ అందుకున్న రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌..

రామ్‌చరణ్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

Updated : 13 Apr 2024 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌ చరణ్‌ (Ram Charan) ఇప్పుడు డాక్టర్‌ రామ్‌ చరణ్‌ అయ్యారు. చెన్నైకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం నేడు (ఏప్రిల్‌ 13) ఆయనకు గౌరవ డాక్టరేట్‌ అందించింది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై డాక్టరేట్‌ను అందుకున్నారు. కళారంగానికి చేసిన విశేష సేవలకు గానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ వాటిని షేర్‌ చేస్తూ అభినందనలు చెబుతున్నారు. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ముందు విశ్వవిద్యాలయం రామ్‌ చరణ్‌ గురించి ప్రత్యేక వీడియోను అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అందులో ఈ మెగా హీరో చిన్నప్పటి సంగతులతో పాటు హీరోగా ఎదిగిన తీరును వర్ణించారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవను చూపించారు.

ఈ సందర్భంగా రామ్‌ చరణ్ మాట్లాడుతూ..‘‘నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి డాక్టరేట్‌ అందించిన వేల్స్‌ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 38 ఏళ్లుగా యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. ఇందులో 45వేలకు పైగా స్టూడెంట్స్‌ ఉన్నారు. ఇంత గొప్ప విశ్వవిద్యాలయం నుంచి నాకు డాక్టరేట్‌ వచ్చిందంటే మా అమ్మ నమ్మలేదు. ఇంతమంది గ్రాడ్యుయేట్స్‌ మధ్యలో ఇలా నిల్చోవడం ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి ఇది నాకు దక్కిన గౌరవం కాదు. నా అభిమానులది, దర్శకనిర్మాతలది, నాతోటి నటీనటులది. 

చెన్నై నాకెంతో ఇచ్చింది. మా నాన్న తన సినీ ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో 80 శాతం మందికి చెన్నైతో అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తే అది తప్పక నెరవేరుతుంది. అదీ ఈ ప్రాంతానికి ఉన్న గొప్పతనం. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నా. ఆయనతో వర్క్‌ చేయాలని చాలామంది అనుకుంటారు. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐదు భాషల్లో పాన్‌ఇండియా చిత్రంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.

గర్వంగా ఉంది: చిరంజీవి

రామ్‌ చరణ్‌ డాక్టరేట్‌ అందుకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘వేల్స్‌ విశ్వవిద్యాలయం రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌ అందించడం చూసి తండ్రిగా గర్వపడుతున్నా. ఇవి భావోద్వేగంతో కూడిన క్షణాలు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. పిల్లలు విజయాలను సాధిస్తున్నప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. లవ్‌యూ మై డియర్‌ డాక్టర్‌ రామ్‌ చరణ్‌’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని