Ram Charan: రామ్‌చరణ్‌ చిత్రం ప్రారంభం

‘‘నేను.. జాన్వీ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్‌లో నటించాలని చాలా మంది కోరుకున్నారు. మా కలయిక ఈ సినిమాతో నిజం కానుండడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా...

Updated : 21 Mar 2024 10:54 IST

‘‘నేను.. జాన్వీ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్‌లో నటించాలని చాలా మంది కోరుకున్నారు. మా కలయిక ఈ సినిమాతో నిజం కానుండడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా... బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్‌ కథానాయిక వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇది రామ్‌చరణ్‌ 16వ చిత్రం. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి క్లాప్‌నివ్వగా... నిర్మాత బోనీ కపూర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అగ్ర దర్శకుడు శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అల్లు అరవింద్‌ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, దర్శకుడు సుకుమార్‌, నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌, సాహు గారపాటి, రామ్‌ ఆచంట, నాగవంశీ, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ప్రారంభం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు సానాకి సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్‌ నలభై నిమిషాలు చెబితే, ఆ కథని రోజూ రెండేసి గంటలు చెప్పేవాడు బుచ్చిబాబు. తన సంకల్పంవల్లే ఇదంతా సాధ్యమైంది. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. ఎ.ఆర్‌.రెహమాన్‌తో నా కెరీర్‌లో ఇంత త్వరగా సినిమా చేస్తాననుకోలేదు’’ అన్నారు.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ సినిమాకి నేను సహాయ దర్శకుడిగా పనిచేశా. నాపైన నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. ఎ.ఆర్‌.రెహమాన్‌తో పనిచేయాలన్న నా కల  నా రెండో సినిమాకే నెరవేరుతోంది. అందుకు కారణం మా గురువు సుకుమార్‌, కథానాయకుడు, నిర్మాతలే. మా అందరికీ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.  సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు సానా ఆలోచనలు గొప్పగా ఉంటాయి. తను నన్ను కలిసినప్పుడు ఐదు సందర్భాలు చెప్పి, ఆ బాణీల గురించి వివరిస్తూ ఓ ఫైల్‌ ఇచ్చాడు. తనలోని ఆసక్తి చూసి ముచ్చటేసింది. ఇప్పటికే మూడు బాణీలు సిద్ధమయ్యాయి’’ అన్నారు. జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేదికని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. బుచ్చిబాబు కథని చెప్పిన విధానం చూసి సినిమా చేయాలనే నిర్ణయానికొచ్చా’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లులాంటిది. తెలుగులో సినిమాలు చేశా. మరిన్ని చేయాలనుకుంటున్నా. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమానీ హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నా’’ అన్నారు బోనీకపూర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని