RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్‌ కొత్త సినిమా ప్రారంభం

రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated : 20 Mar 2024 17:13 IST

హైదరాబాద్‌: ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌, సుకుమార్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీకపూర్‌తోపాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడారు. అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు. 

‘‘బుచ్చిబాబుకు సినిమా అంటే చాలా ఇష్టం. ‘రంగస్థలం’ చేసినప్పుడు సుకుమార్‌ నాకు కేవలం 38 నిమిషాల్లో కథ చెబితే.. రెండు నెలలపాటు ప్రతిరోజూ రెండు గంటలు నెరేషన్‌ ఇచ్చింది బుచ్చిబాబునే. ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తోన్న వారందరినీ ఒకే చోటకు తీసుకురావడం అంత సులభం కాదు. పట్టుదల, సంకల్పంతోనే ఆయన దీనిని సాధించారు. ఆయనతో వర్క్‌ చేస్తున్నందుకు ఆనందిస్తున్నా. రెహమాన్‌ సర్‌.. మీరు నాతో ఇలా స్టేజ్‌పై ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. జాన్వీకపూర్‌, నేను కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామంది భావించారు. వారందరి కల ఇలా నెరవేరనుంది’’ అని చరణ్‌ అన్నారు. బుచ్చిబాబు కలలు భారీ స్థాయిలో ఉంటాయని సుకుమార్‌ అన్నారు. స్క్రిప్ట్‌పై ఎంతో నమ్మకం ఉందన్నారు.

అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘‘రంగస్థలం’ చిత్రానికి అసిస్టెంట్‌ దర్శకుడిగా వర్క్‌ చేశా. నా రెండో చిత్రానికే రెహమాన్‌తో కలిసి వర్క్ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. హీరోయిన్‌ పాత్ర రాసుకున్నప్పుడే జాన్వీ లాంటి అమ్మాయి దొరికితే బాగుండు అనుకున్నా. జాన్వీనే టీమ్‌లో భాగమయ్యారు. ఇది అందరికీ గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. జాన్వీకపూర్‌ కథానాయిక. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. RC16గా ఇది ప్రచారంలో ఉంది. ‘పెద్ది’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలు కానుంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల్లో బిజీగా ఉండగా, ‘దేవర’ కోసం జాన్వీ వర్క్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు