Ram Pothineni: ‘స్కంద’ సన్నివేశంపై ట్రోల్స్.. ఫొటోతో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన రామ్‌ పోతినేని

Hero Ram: ‘స్కంద’ మూవీలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌పై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్‌ వస్తున్న నేపథ్యంలో రామ్‌ స్పందించారు.

Published : 05 Nov 2023 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ (Ram) హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’ (Skanda). తాజాగా ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా అలరిస్తోంది. అయితే, ఇందులోని కొన్ని ఫైటింగ్ సీన్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వీటిపై రామ్ స్పందిస్తూ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. సినిమా కోసం తానెంత కష్టపడ్డారో తెలిపారు. అలాగే ఆ ఫైటింగ్ సీన్‌ జరిగిన తేదీ కూడా గుర్తుందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

‘‘ఏప్రిల్‌ 24న ఈ ఫైట్‌ను చిత్రీకరించారు. 25రోజుల షెడ్యూల్‌లో మూడో రోజు దీన్ని షూట్ చేశారు. ఈ సీన్‌ తర్వాత నేను నడవలేకపోయాను. అడుగు కూడా వేయలేని పరిస్థితి. పాదాలు పగిలి రక్తం వచ్చింది. ఇక ఈ సీన్‌లో ఎలా నటించాలో బోయపాటి శ్రీను స్వయంగా చేసి చూపారు. అంత కష్టపడినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. మన సినిమాలోని కంటెంట్‌ అందరికీ నచ్చాలని నిబంధన లేదు. అది పూర్తిగా ప్రేక్షకుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. నేను మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం ఏమీ ఆశించకుండా నా రక్తాన్ని చెమటగా చిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అంటూ ఆ సన్నివేశంలో గాయపడిన కాలు ఫొటోను షేర్ చేశారు. ఇది చూసిన వారంతా ‘సినిమాలపై మీకున్న తపన తెలుస్తోంది’, ‘చెత్త కామెంట్స్‌ పెట్టేవాళ్లకు మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ ఆయన అభిమానులు రామ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇక ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్‌ పూర్తి మాస్‌ అవతార్‌లో కనిపించారు. ఆయన సరసన మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ శ్రీలీల నటించగా సయీ మంజ్రేకర్, ప్రిన్స్‌ సిసిల్‌, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో మంచి టాక్‌తో దూసుకుపోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని