Rana Daggubati: నా గురించి అడగాలంటే ఆ అవయవాలు దానం చేయండి: రానా

నటుడు రానా తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 28 Feb 2024 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషించి ప్రపంచస్థాయి గుర్తింపుతెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). గుర్గావ్‌లో జరిగిన సినాప్స్‌ వేడుకలో పాల్గొన్న రానా తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి మాట్లాడారు. ‘‘ నా ఆరోగ్యం గురించి ఎవరైనా అడగాలి అనుకుంటే కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటే అడగండి. లేదంటే అడిగే అవసరం లేదు. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు. ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదు. ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినపుడు అక్కడే నాకున్న అనారోగ్య సమస్యలు తెలిశాయి. ఆ సమయంలోనే నన్ను నేను భిన్నంగా చూడడం మొదలుపెట్టాను. సమస్యలు ఎదురైనప్పుడే చాలా విషయాలు తెలుస్తాయి. అన్నీ ఒకేలా ఉండవని గ్రహించాను. అప్పటివరకు నన్ను ముందుకి నడిపిస్తున్నాయి అనుకున్నవి మధ్యలోనే వదిలేశాయి’’ అని రానా వెల్లడించారు. 

‘‘బాహుబలి’ కోసం నేను పెరిగిన బరువు అనారోగ్యం వల్ల తగ్గాను. అప్పుడు అందరూ ఆరోగ్యంగానే ఉన్నావా అంటూ ప్రశ్నించేవారు. వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. వీటి నుంచి కోలుకున్న తర్వాత ‘అరణ్య’ షూటింగ్‌లో పాల్గొన్నాను. సంవత్సరం పాటు అడవిలో నివసించే అవకాశం వచ్చింది. ఏనుగులతో కలిసి నటించాను. ఆరోగ్యం బాగా లేకున్నా అక్కడ నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు. అప్పుడు ఆ నిశ్శబ్ద వాతావరణం ఎంతో ఉపయోగపడింది.  ప్రకృతికి మించిన వైద్యం లేదని అర్థమైంది’’ అని రానా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని