Rana naidu: భారత్‌ నుంచి ఒకే ఒక్కడు రానా నాయుడు

విమర్శల మధ్య విడుదలైనా సరే..ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి ఘనతను పొందవచ్చని మరోసారి రుజువు చేసింది ‘రానా నాయుడు’ సిరీస్‌. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది.

Updated : 14 Dec 2023 09:22 IST

విమర్శల మధ్య విడుదలైనా సరే..ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి ఘనతను పొందవచ్చని మరోసారి రుజువు చేసింది ‘రానా నాయుడు’ సిరీస్‌. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. అగ్రకథానాయకుడు వెంకటేశ్‌, రానా తండ్రీ కొడుకులుగా కనిపించిన ఈ సిరీస్‌ వివాదాల్లో నిలిచినప్పటికీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సిరీస్‌ అరుదైన ఘనతను సాధించింది. 2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన వాటి వివరాలను ‘వాట్‌ వి వాచ్డ్‌’ అనే పేరుతో ఓ జాబితాను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ చోటు దక్కించుకుంది. అంతేకాదు ఆ జాబితాలో భారత్‌ నుంచి ఈ ఒక్క సిరీస్‌ మాత్రమే ఉండటం విశేషం. 2021 నుంచి ప్రతి వారం ఎక్కువమంది వీక్షించిన టాప్‌ 10 సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల జాబితాను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి కూడా ఆ తరహాలోనే సుమారు 18వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించిన టాప్‌ 400 టైటిల్స్‌ను విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ 336 స్థానంలో నిలిచింది. ఈ సిరీస్‌ను 46మిలియన్ల గంటల పాటు అభిమానులు చూసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ తెలిపింది. ఇక ఇటీవలే ఈ సిరీస్‌కు సీక్వెల్‌ ఉన్నట్లు ప్రకటించారు. మరెన్నో మలుపులతో, కొత్త కథనంతో మరింత యాక్షన్‌ డ్రామాతో త్వరలో ప్రేక్షకులను అలరించనుందని తెలిపింది సిరీస్‌బృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని