Ranbir Kapoor: ‘యానిమల్‌’ టూ రామాయణ’.. రణబీర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ షేర్‌ చేసిన ట్రైనర్‌

‘రామాయణ’ కోసం రణ్‌బీర్‌ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్‌ ట్రైనర్‌ పోస్ట్‌ చేశారు. 

Updated : 25 Apr 2024 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజాగా ‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్న రణ్‌బీర్‌ (Ranbir Kapoor) తర్వాత సినిమా కోసం సిద్ధమవుతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందించనున్న ‘రామాయణ’లో ఆయన లుక్‌ కోసం జిమ్‌లో శ్రమిస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత ట్రైనర్‌ శివోహం.. ‘యానిమల్‌’ నుంచి ‘రామాయణ’ వరకు రణ్‌బీర్‌ ఎంతో చమటోడ్చినట్లు రాసుకొచ్చారు.

‘మూడు సంవత్సరాల నుంచి రణ్‌బీర్‌ ఎంతో కష్టపడుతున్నారు. జీవితంలో షార్ట్‌కట్‌లు తీసుకోవడం వల్ల సాధించేదేమీ లేదు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళిక అవసరం. ఆయన సంకల్పం చాలా గొప్పది. మీతో ఇన్నేళ్ల నా ప్రయాణం మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. తదుపరి బ్లాక్‌బస్టర్‌కు ముందుగానే శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ‘యానిమల్‌’ లుక్‌ను కొత్త ఫొటోతో పోలుస్తూ ఒక ఇమేజ్‌ను షేర్‌ చేశారు. దీనికి ‘రామాయణ ది ఫిల్మ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ లుక్‌ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.  ఇక ఇటీవల ఈ బాలీవుడ్‌ హీరో విలువిద్య నేర్చుకుంటున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రం కోసం ఆయన  కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు.

భారీ తారాగణంతో నిర్మిస్తున్న ‘రామాయణ’ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకొన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ముంబయిలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. ఇందులోని నటీనటులు లుక్‌లు లీక్‌ కాకుండా ఉండేందుకు సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. దీనికి తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram)కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని