Shankar: శంకర్‌ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్‌తో అలరించిన రణ్‌వీర్‌ సింగ్‌

శంకర్‌ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

Updated : 17 Apr 2024 11:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya Shankar) వివాహం సోమవారం వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖుల కోసం మంగళవారం చెన్నైలో వివాహ విందు ఏర్పాటు చేశారు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌కు చెందిన తారలు దీనిలో పాల్గొన్నారు. చిరంజీవి-సురేఖ దంపతులు, మోహన్‌లాల్‌, అట్లీ, విజయ్‌ సేతుపతి, జాన్వీకపూర్‌, వెట్రీమారన్‌, లోకేశ్‌ కనగరాజ్‌, అనిరుధ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రెహమాన్‌, రామ్‌చరణ్‌ తదితరులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్స్‌తో అలరించారు. శంకర్‌ చిన్న కుమార్తె అదితితో కలిసి ‘లుంగీ డ్యాన్స్‌’, ‘వాతి కమింగ్‌’ వంటి పాటలకు స్టెప్పులేశారు. అట్లీ కూడా ఈ డ్యాన్స్‌లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె పెళ్లి జరిగింది. పరస్పర అంగీకారంతో వారు విడాకులు తీసుకున్నారు. ఇక తరుణ్‌ కార్తీక్‌.. శంకర్‌ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు.

శంకర్‌ ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాల కోసం వర్క్ చేస్తున్నారు. కమల్‌హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఆ సినిమా జూన్‌లో విడుదల కానుంది. రామ్‌చరణ్‌ నటిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల కావచ్చు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని టాక్‌. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని