Ravi teja: ‘ఈగల్‌’ టీమ్‌ డేరింగ్‌ స్టెప్‌.. అందుబాటు ధరలో మూవీ టికెట్స్‌.. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే?

Eagle Movie: రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఈగల్‌’ మూవీ టికెట్‌ ధరలపై చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 06 Feb 2024 17:50 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమ మంచి కోరి సంక్రాంతి పోటీ నుంచి తప్పుకొంది ‘ఈగల్‌’ (Eagle Movie). రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కొత్త సినిమాలు, అందునా అగ్ర కథానాయకులవైతే టికెట్‌ ధరలు పెంచి మరీ ప్రదర్శిస్తున్నారు. అందుకు భిన్నంగా సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా టికెట్‌ ధరలను తగ్గించింది.

తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150కే ‘ఈగల్‌’ మూవీ టికెట్‌ ధరలను పరిమితం చేసింది. అత్యధికంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధర రూ.295 నిర్ణయించే అవకాశం ఉన్నా, సినిమాను వీలైనంత ఎక్కువమందికి చేరువ చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. అత్యధిక మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో టికెట్‌ రూ.200 మాత్రమే చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం కావడంతో చాలా మంది సినిమాలకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది.

సినిమాపై సంతృప్తి వ్యక్తం చేసిన రవితేజ

ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించగా, తాజాగా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రవితేజతో పాటు, చిత్ర బృందం కలిసి ఈ సినిమాను చూసింది. కార్తిక్‌ ఘట్టమనేని టేకింగ్‌పై రవితేజ సంతృప్తి వ్యక్తం చేశారు. స్క్రీనింగ్‌ పూర్తయిన తర్వాత దర్శకుడు, చిత్ర నిర్మాతకు శుభాకాంక్షలు చెప్పారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్రెండ్‌ అవుతున్న రవితేజ ర్యాప్‌ సాంగ్‌

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విశాఖకు చెందిన షిషోర్‌ అనే యువకుడు రవితేజ లైఫ్ జర్నీని ర్యాప్‌ సాంగ్‌ రూపంలో ఆలపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతుండగా, ఆ పాటలో రవితేజ సినిమాల్లోని సీన్స్‌ను జోడించిన వీడియో ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఆ వీడియోను షేర్‌ చేసింది. ‘ఈ వీడియో ఇంకా బాగుంది’ అని ట్వీట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని