Eagle: అవుట్‌పుట్‌ అదిరింది.. మీ స్పందన కోసం వేచి చూస్తున్నా: రవితేజ

తన కొత్త సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చిందని, ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నానని ప్రముఖ హీరో రవితేజ అన్నారు.

Published : 05 Feb 2024 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), కావ్యా థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్లు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం రాత్రి నిర్వహించారు. దర్శకులు అనుదీప్‌ కె.వి, శ్రీరామ్‌ ఆదిత్య, వంశీ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకనుద్దేశించి రవితేజ మాట్లాడుతూ.. ‘‘అనుపమ, కావ్య.. ఇలా వీళ్లందరితో కలిసి నటించడం ఇదే తొలిసారి. అనుపమ పాత్రే ఈ సినిమా కథను నడిపిస్తుంది. నవదీప్‌కు బలమైన క్యారెక్టర్‌ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. అతడికి మంచి గుర్తింపు తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఎవరూ ఊహించలేని విధంగా డైలాగ్స్‌ చెప్పాడు. ఇద్దరం కలిసి మళ్లీ ఓ కామెడీ సినిమాలో నటించాలనుకుంటున్నాం. ‘ఈగల్‌’ సినిమా ఔట్‌పుట్‌ అదిరింది. మీ (ప్రేక్షకులు) స్పందన కోసం వేచి చూస్తున్నా. కార్తీక్‌ స్పష్టత కలిగిన దర్శకుడు. ఆ అంశం నన్ను ఆకట్టుకుంది. అతడు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

‘‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నేను నటించిన రెండో చిత్రమిది. ఈ సినిమా దర్శకుడిని నేను అన్నయ్య అని పిలుస్తా. నాకు మంచి పాత్ర ఇచ్చాడు. ఈ చిత్రంలో రవితేజగారు చాలా అందంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది’’ అని అనుపమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని కావ్యా థాపర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని