Ravi Teja: యూట్యూబ్‌లో రవితేజ చిత్రం రికార్డు.. నిర్మాణ సంస్థ పోస్ట్‌

స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వ‌ర‌రావు’ (Tiger nageswara rao). రవితేజ (ravi teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది.

Updated : 21 Apr 2024 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా వంశీ రూపొందించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao).  స్టూవర్టుపురం గజ దొంగగా పేరు పొందిన నాగేశ్వరరావు కాలం నాటి వాస్తవ సంఘటనలు, వార్తలు ఆధారం చేసుకుని దీనిని తీర్చిదిద్దారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది అక్టోబర్‌లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. రవితేజ యాక్టింగ్‌ బాగున్నప్పటికీ కథ, స్క్రీన్‌ప్లేలో స్వల్ప లోపాలున్నాయని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పుడుది యూట్యూబ్‌లో రికార్డ్‌ క్రియేట్ చేసింది. దాదాపు రెండు నెలల క్రితం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేయగా.. ఇప్పటివరకూ 100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. అలాగే, పది లక్షల మంది లైక్‌ కొట్టారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ పెట్టింది.

కథేంటంటే: 1970, 80 దశ‌కాల్లో స్టూవర్టుపురం నాగేశ్వ‌ర‌రావు పేరు వింటే చాలు.. అటు ప్ర‌జల్లోనూ ఇటు పోలీసు వ్య‌వ‌స్థ‌లోనూ ఓ ర‌కమైన అల‌జ‌డి మొద‌ల‌య్యేది. దోపిడీల‌కి పెట్టింది పేరైన నాగేశ్వ‌ర‌రావు కన్నుప‌డిందంటే చాలు.. ఎంత విలువైన‌దైనా, ఎంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్నా చెప్పి మ‌రీ దొంగ‌త‌నం చేస్తాడని పేరు. త‌ను దొంగ‌త‌నాలు చేసే ప్రాంతాన్ని టైగ‌ర్ జోన్ అనీ... అత‌న్ని  టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనీ పిలుస్తుంటారు. ఇప్ప‌టికీ ఆయ‌న గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటుంటారు. అంత పేరు మోసిన దొంగ క‌థ‌తో రూపొందిన చిత్ర‌మే.. ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. టైటిల్ పాత్ర‌లో ర‌వితేజ న‌టించారు. 1980 నేప‌థ్యంలో క‌థ  మొద‌ల‌వుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్టూవ‌ర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వ‌ర‌రావు గురించి దిల్లీలో చ‌ర్చ మొద‌ల‌వుతుంది ప్ర‌ధానమంత్రి భ‌ద్ర‌తని స‌మీక్షించే ఇంటిలిజెన్స్ అధికారి రాజ్‌పుత్ (అనుప‌మ్ ఖేర్‌) స్వ‌యంగా రంగంలోకి దిగి స్టూవర్టుపురం గురించి తెలిసిన పోలీస్ అధికారి విశ్వ‌నాథ్ శాస్త్రి (ముర‌ళీశ‌ర్మ‌)ని పిలిపించి నాగేశ్వ‌ర‌రావు గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెడ‌తారు. అందుకు కార‌ణ‌మేంటి?అస‌లు ఈ దోపిడీల‌కి పాల్ప‌డుతున్న నాగేశ్వ‌ర‌రావు ల‌క్ష్యం ఏమిటనేది అస‌లు క‌థ‌. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ దీనిని నిర్మించారు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణూ దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని