Raviteja: విధ్వంసాన్ని ఆపే వినాశనం

‘‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు’’ అంటూ తాను పోషించిన పాత్రని తనదైన శైలిలో పరిచయం చేశారు రవితేజ

Updated : 21 Dec 2023 09:30 IST

‘‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు’’ అంటూ తాను పోషించిన పాత్రని తనదైన శైలిలో పరిచయం చేశారు రవితేజ. ఆ పాత్ర వెనక కథేమిటో తెలియాలంటే ‘ఈగల్‌’ చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు. ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకని నిర్వహించారు. పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, నక్సలైట్లు... ఇలా ఎంతోమందికి లక్ష్యంగా మారిన వ్యక్తిగా రవితేజ కనిపిస్తున్నారు. ‘తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్‌ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్నవాడిని తాకినప్పుడు’ అంటూ మొదలవుతుంది ట్రైలర్‌. ‘విశ్వం తిరుగుతాను. ఊపిరి ఆపుతాను. కాపలా అవుతాను. విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను’ అంటూ సాగే సంభాషణలు ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి. వేడుకను ఉద్దేశించి రవితేజ మాట్లాడుతూ ‘‘కార్తీక్‌ రూపంలో మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. సినిమాకి అద్భుతమైన సౌండ్‌ని ఇచ్చారు డేవ్‌జాంద్‌. ఇందులో అందరి పాత్రలు చాలా బాగుంటాయి. రచయిత మణి శక్తివంతమైన మాటలు రాశారు. జనవరి 13న థియేటర్లలో కలుద్దాం’’ అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని అలరించే యాక్షన్‌, భావోద్వేగాలు, విజువల్స్‌ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ‘ధమాకా’ తర్వాత మరో విజయాన్ని అందుకుంటున్నాం’’ అన్నారు.


షో టైం ముస్తాబు

సినీ జగత్తులోకి అడుగిడాలనుకునే కుర్రకారు కలలు.. పరిశ్రమలో నెలకొన్న బంధుప్రీతి.. తెర వెనక సాగే పరిణామాలు.. వీటన్నింటి సమాహారమే ‘షో టైం’. దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణసంస్థ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ నిర్మిస్తున్న తొలి ఫిక్షనల్‌ వెబ్‌సిరీస్‌ ఇది. ఇమ్రాన్‌ హష్మీ కథానాయకుడు కాగా.. శ్రియ, నసీరుద్దీన్‌ షా, మౌనీరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిహిర్‌ దేశాయ్‌, అర్చిత్‌ కుమార్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ మొదటి గ్లింప్స్‌ను బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కరణ్‌ జోహార్‌. ‘లైట్స్‌, కెమెరా, యాక్షన్‌ ప్రపంచానికి స్వాగతం. అధికారం కోసం పోరాటంలో చిక్కుకుపోయిన కొందరి జీవితం ఇది. ఆ సరిహద్దులు తెలిపే వెబ్‌సిరీస్‌ ‘షో టైం’. ఆ సరిహద్దుల్ని చెరిపేయాల్సిందే’ అనే వ్యాఖ్యలు జోడించారు.


తిరగబడిన ప్రేమ

సూర్య శ్రీనివాస్‌, శివ బొడ్డురాజు కథానాయకులుగా నటించిన చిత్రం  ‘చిఎవోల్‌’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రామ్‌ యోగి వెలగపూడి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా... ఇద్దరు స్నేహితుల మధ్య రహస్య ఒప్పందం నేపథ్యంలో సాగే చిత్రమిది. లవ్‌ అనే ఆంగ్ల పదంలోని అక్షరాల్ని తిరగేస్తూ ఈ సినిమాకి పేరుని ఖరారు చేశాం. కథకీ, ఆ పేరుకీ సంబంధం ఉంది. రివర్స్‌ లవ్‌స్టోరీగా సహజ సిద్ధమైన సన్నివేశాలతో చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. సంగీతం: సునీల్‌ కశ్యప్‌.


మోస్ట్‌ వాంటెడ్‌ కరీంనగర్‌ కుర్రాళ్లు

ముగ్గురు యువ కథానాయకులు అమన్‌ సూరేపల్లి, సాయి సూరేపల్లి, అనిరుధ్‌ తుకుంట్లలను పరిచయం చేస్తూ.. బాలాజీ భవనగిరి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్‌సిరీస్‌ ‘కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌’. స్ట్రీట్‌ బీట్జ్‌ సినిమా నిర్మిస్తోంది. కరీంనగర్‌ నగరంలోని ముగ్గురు సామాన్య కుర్రాళ్ల జీవితాలని ఆసక్తికరంగా చూపిస్తూ ఇటీవల విడుదలైన ట్రైలర్‌.. యాక్షన్‌ డ్రామా, భావోద్వేగాలతో కట్టిపడేసింది. సిరీస్‌లోని ‘కరీంనగర్స్‌ వాలే’ పాటకి మంచి స్పందన దక్కుతోంది. ‘ఈ సిరీస్‌ చిత్రీకరణ మొత్తం కరీంనగర్‌లోనే జరిగింది. ఇందులో నటించిన నటీనటులంతా అక్కడివారే. దీంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధంగా ఉందీ సిరీస్‌. సాహిత్య సాగర్‌ సంగీతం, ఎస్‌.అనంత్‌ శ్రీకర్‌ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘బలగం’ ఫేమ్‌ రచయిత రమేష్‌ ఎలిగేటి మంచి కథనాన్ని, సంభాషణల్ని అందించారు. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా అభిమానులకు గొప్ప విజువల్స్‌ని అందించనున్నార’ని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ సిరీస్‌ ఆహాలో అందుబాటులో ఉండనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని