Trisha: త్రిష బాలీవుడ్‌కు వెళ్లకపోవడానికి కారణమిదేనా!

దక్షిణాదిలో వరుస సినిమాలతో అలరిస్తున్న త్రిష బాలీవుడ్‌లో ఒక్క సినిమానే చేయడానికి గల కారణమేమిటంటే..

Published : 23 Mar 2024 19:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు పదుల వయసులో కూడా స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు హీరోయిన్‌ త్రిష (Trisha). తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో మెప్పిస్తోన్న ఆమె ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఒక్క సినిమానే చేశారు. ఒకే చిత్రంతో ఎందుకు సరిపెట్టుకున్నారో ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

2010లో అక్షయ్ కుమార్‌ హీరోగా వచ్చిన ‘ఖట్టా మీఠా’లో త్రిష హీరోయిన్‌గా నటించారు. దీనికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ కామెడీ డ్రామా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే త్రిష ఇప్పటివరకు నటించిన మొదటి, చివరి బాలీవుడ్ చిత్రం. ఆ సినిమా ఫ్లాప్‌ కావడం వల్లే ఆమె బాలీవుడ్‌కు స్వస్తి పలికారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల ఈవిషయంపై మాట్లాడిన ఆమె.. ‘ముంబయికి మకాం మార్చడానికి సిద్ధంగా లేను. అక్కడికి వెళ్లాలంటే సౌత్‌లో చాలావాటిని విడిచివెళ్లాలి. బాలీవుడ్‌కు వెళ్లి నా కెరీర్‌ను మళ్లీ ప్రారంభించేంత ఆసక్తి అప్పట్లో లేదు’ అని చెప్పారు. అయితే ఆమె నటించిన చాలా సినిమాలు హిందీలో రీమేక్‌ చేశారు. అవి అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం త్రిష ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రమిది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్న లక్ష్యంతో చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తోంది. 18 ఏళ్ల తర్వాత చిరు- త్రిషలు ఈ చిత్రం కోసం కలిసి నటిస్తుండడం విశేషం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’లోనూ త్రిష నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని