Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్‌ శెట్టి

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలో రిషబ్‌ శెట్టి పాల్గొన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Published : 29 Nov 2023 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్క హిట్‌ తమ ఖాతాలో పడగానే ఇతరుల్లా తాను కన్నడ చిత్ర పరిశ్రమను వదిలిపెట్టాలనుకోవడం లేదని నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) అన్నారు. ‘కాంతార’ (Kantara) సినిమా క్రెడిట్‌ కన్నడ ప్రేక్షకులదేనని పేర్కొన్నారు. ముందుగా వారు ఆదరించి విజయాన్ని అందిస్తే ఆ తర్వాత ఇతర భాషల్లో ఆ సినిమా డబ్‌ అయిందని తెలిపారు. గోవా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) (International Film Festival of India) వేడుకకు అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటీటీలపై స్పందిస్తూ.. ‘‘ఎన్‌ఎఫ్‌డీసీ (నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఫిల్మ్‌ బజార్‌లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేది. కొవిడ్‌ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వినియోగం పెరగడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్‌ సినిమా అనుకున్నంత ఫలితం ఇవ్వకపోడంతో ఓటీటీ సంస్థలు కన్నడ చిత్రాలన్నింటినీ తిరస్కరిస్తున్నాయి. అది చాలా బాధాకరం’’ అని అన్నారు.

జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నటి ప్రగతి

‘‘కాంతార’ తర్వాత నాకు ఇతర చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, నేను వాటిని తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. కంటెంట్‌ బాగుంటే భాషతో సంబంధంలేకుండా ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. నా కొత్త సినిమా ‘కాంతార ఏ లెజెండ్‌: చాప్టర్‌ 1’ గురించి నేను మాట్లాడాలనుకోవడంలేదు. ప్రేక్షకులే దాని గురించి మాట్లాడాలి. టీమ్ అంతా పనిపైనే దృష్టిపెట్టాం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ టీజర్‌కు మంచి స్పందన దక్కింది. ‘కాంతార’ చిత్రీకరణ సమయంలో ఈ ప్రీక్వెల్‌ తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది. ఆ సినిమా హిట్‌కావడంతో ప్రీక్వెల్‌ తీయాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపారు. 

తొలి కన్నడ చిత్రంగా..

54వ ‘ఇఫి’ వేడుకలో ‘కాంతార’కు సిల్వర్‌ పీకాక్‌ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రం ఇదేనని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు