RRR: ట్రెండింగ్‌లో ‘ఆర్ఆర్‌ఆర్‌’.. కారణమేమిటంటే!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయింది.

Published : 25 Mar 2024 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ (Ram charan), ఎన్టీఆర్‌ (NTR) కథానాయకులుగా దర్శకధీరుడు తెరకెక్కించిన అద్భుతం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం సినీ ప్రియుల కలను సాకారం చేస్తూ ఆస్కార్‌ను తెచ్చింది. నేడు ఈ సినిమా పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం ఈ విజువల్‌ వండర్ విడుదలై నేటికి రెండేళ్లు పూర్తి కావడమే.

2017 నవంబర్ 18న పోస్టర్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రయాణం మొదలైంది. 2022 మార్చి 25న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు ఆ సినిమాలోని సన్నివేశాలను షేర్‌ చేస్తున్నారు. ‘ఇందులో మీకు నచ్చిన సీన్‌ ఏది’, ‘మీకు నచ్చిన డైలాగ్‌లు, పాటలు ఏవి?’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో #RRR హ్యాష్‌ట్యాగ్‌ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘ఈ సినిమాపై ప్రేమ చూపిస్తున్నందుకు ప్రపంచానికి ధన్యవాదాలు’ అని చిత్రబృందం తెలిపింది.

విడుదలైన ప్రతి చోట సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. జపాన్‌ దేశంలో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘనత దక్కించుకుంది. ఎందరో హాలీవుడ్‌ ప్రముఖులు కూడా దీనిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లపై ఆంగ్ల మీడియాల్లోనూ వార్తలు ప్రసారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం పలు కేటగిరీల్లో 131 నామినేషన్లలో నిలిచింది. గోల్డెన్‌ గ్లోబ్‌, ఆస్కార్‌లతో సహా మొత్తం 60 అవార్డులను సొంతం చేసుకుంది. దీనికి రెండేళ్లు పూర్తవ్వడంతో అభిమానులు ఈ విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని