SSMB29: మహేశ్‌-రాజమౌళి మూవీ.. అవి పూర్తయితేనే ప్రకటన వచ్చేది!

Mahesh babu: రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Updated : 26 Feb 2024 22:45 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. తాజాగా మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

బిగ్‌ ప్రెస్‌మీట్‌..

మహేశ్‌బాబుతో సినిమా ఉంటుందని ప్రకటించడం తప్ప, మిగిలిన వాటి గురించి అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా లేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా?లేదా?అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే, ఈసారి జక్కన్న కాస్త పెద్దగానే ప్లాన్‌ చేస్తున్నారని అంటున్నారు. నేషనల్‌ లెవల్‌లో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని టాక్‌. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా?అని ఆలోచిస్తున్నారట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది పక్కన పెడితే, సినిమాకు హైప్‌ రావడం ఖాయం. ఆ ప్రెస్‌మీట్‌లోనే సినిమాకు సంబంధించిన పలు విషయాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఎప్పుడు మొదలవుతుంది?

యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ రోజులు ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ చేయాల్సి వస్తోంది. సినిమా కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే కథా నేపథ్యానికి సంబంధించిన సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు జరుగుతున్నట్లు టాక్‌. ఇక సినిమాకు కొత్త టెక్నాలజీని ఎలా అడాప్ట్‌ చేయాలి? అన్నదానిపైనా చర్చ నడుస్తోందట. ఇక రాజమౌళి సినిమా ప్రమోషన్స్‌ విభిన్నంగా ఉంటాయి. అందుకు తగినట్లు సోషల్‌మీడియా టీమ్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన థీమ్స్‌, లోగోలను కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ పనులన్నీ కొలిక్కి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. తొలుత వినిపించిన టాక్‌ ప్రకారం తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 9న సినిమాను అధికారికంగా ప్రారంభించాలని అనుకున్నారట. అయితే, ప్రీ ప్రొడక్షన్‌ పనులకు ఇంకాస్త సమయం కావాల్సి రావడంతో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న స్టార్ట్‌ చేస్తారని సోషల్‌మీడియాలో టాక్‌ నడుస్తోంది. కానీ, మరీ ఐదు నెలల సమయం అంటే ఎక్కువే. పైగా వర్షాకాలం కూడా మొదలైపోతుంది. అంతకన్నా ముందే షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

లుక్‌ బయటకు రావొద్దు..!

‘గుంటూరు కారం’ తర్వాత మహేశ్‌బాబు కాస్త విరామం తీసుకుని, రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో ఇందులో కనిపించనున్నారని టాక్‌. అదే సమయంలో దృఢంగా కనిపించేందుకు అవసరమైన కసరత్తులు కూడా చేస్తున్నారట. ఇక మహేశ్‌ వివిధ ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మొదలయ్యేలోపు ప్రకటనలకు సంబంధించిన షూట్స్‌ ఉంటే పూర్తి చేసుకోవాలని జక్కన్న సూచించారట. త్వరలోనే సినిమాకు సంబంధించి నటీనటులు, టెక్నికల్‌ టీమ్‌తో వర్క్‌షాప్‌ను ఏర్పాటుచేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని