Sai Pallavi - Rana: ‘రానా జెంటిల్‌మెన్‌’ అంటోన్న నెటిజన్లు.. కారణమేమిటంటే..?

ఓ గొప్ప నిర్మాత మనవడు, పేరుపొందిన నిర్మాత తనయుడు, మంచి నటుడు.. ఇలా రానాకు సినీ ప్రియుల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఎంతోమంది అభిమానులు ఉన్నప్పటికీ.. తన ఫేమ్‌ మొత్తాన్ని పక్కన పెట్టి...

Updated : 16 Nov 2023 14:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ఓ గొప్ప నిర్మాత మనవడు, పేరుపొందిన నిర్మాత తనయుడు, మంచి నటుడు.. ఇలా రానాకు సినీ ప్రియుల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఎంతోమంది అభిమానులు ఉన్నప్పటికీ.. తన ఫేమ్‌ మొత్తాన్ని పక్కన పెట్టి సహనటి కోసం ఆయన రక్షకుడిగా మారిన విధానం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. భారీ వర్షం పడుతుండటంతో.. ఈవెంట్‌లో నటి మాట్లాడటానికి ఇబ్బందిపడుతుంటే ఆమెకు గొడుగు పట్టుకోవడం, ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు అత్యుత్సాహం కనబరిచిన వేళ.. బాడీగార్డ్‌లా మారి రక్షించడం.. ఇలా రానా చేసిన కొన్ని పనులు ఇప్పుడు నెటిజన్ల మది దోచేస్తున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరంటే సాయిపల్లవి.

ముఖం చూడకుండా కేవలం ఓ విప్లవ వీరుడు రాసిన రచనలు చదివి అతనితో ప్రేమలోపడి.. అతని కోసం ఎంత దూరమైన వెళ్లాలనుకునే ఓ అమ్మాయి ప్రేమకావ్యంగా సిద్ధమైన చిత్రం ‘విరాటపర్వం’. ‘వెన్నెల’ అనే అమ్మాయిగా సాయిపల్లవి, ‘రవన్న’ లాంటి ఆవేశ భావజాలం కలిగిన విప్లవకారుడిగా రానా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్స్‌ గత కొంతకాలంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘విరాటపర్వం’ ట్రైలర్‌ విడుదల కర్నూలులో నిర్వహించారు. అభిమానులందరూ వేడుక జరిగే మైదానంలో ఎదురుచూస్తుండగా అనుకోనివిధంగా భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లోనూ ‘విరాటపర్వం’ టీమ్‌ స్టేజ్‌పైకి వచ్చి అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు. సాయిపల్లవి మాట్లాడుతున్న సమయంలో వాన పడుతుండటంతో రానా వెంటనే ఆమెకు గొడుగుపట్టుకున్నారు. అనంతరం వరంగల్‌లో జరిగిన ఆత్మీయ వేడుక సభలో ఓ అభిమాని సాయిపల్లవితో ఫొటో దిగేందుకు అత్యుత్సాహం కనబర్చగా.. రానా వారించి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. వేడుక పూర్తైన వెంటనే ఆయన కూడా ఓ బౌన్సర్స్‌లా ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చేశారు. ఇక, మరో వేడుకలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. వేడుక పూర్తైన వెంటనే సాయిపల్లవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేజ్‌పై నుంచి తీసుకువచ్చేందుకు ఆయన ఓ బాడీగార్డ్‌లా మారారు. దీనికి సంబంధించి వీడియోలు బయటకు రాగా వాటిని చూసిన నెటిజన్లు రానాని అభినందిస్తున్నారు. ‘రానా.. ది జెంటిల్‌మెన్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని