Salaar Release Date: అప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇప్పుడు ‘సలార్‌’.. విడుదల వాయిదాకు కారణమిదేనా?

Salaar Release Date: ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సలార్‌’ విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Published : 12 Sep 2023 16:55 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar: Part 1 Ceasefire). రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సెప్టెంబరు 28న విడుదల కావాల్సి ఉంది. గ్లింప్స్‌తోనే చిత్ర బృందం ‘సలార్‌’పై అంచనాలను పెంచేసింది. అయితే, ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా, ‘సలార్‌’ వాయిదా పడినట్లే. అందుకు కారణం వీఎఫ్‌ఎక్స్‌. కీలక సన్నివేశాలను మరింత ఎలివేట్‌ చేసేందుకు డిజైన్‌ చేసుకున్న వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కు సంబంధించి పనులు పూర్తికాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారని సమాచారం.

‘సలార్‌’కు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పనులను చేసేందుకు చిత్ర బృందం పది కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. వాటిల్లో ఒక కంపెనీపై తీవ్ర పనిభారం పడటంతో ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం VFX షాట్స్‌ను పూర్తి చేయలేకపోయింది. అయితే, సినిమా విడుదల సమయానికి వాటిని పూర్తి చేస్తామని చెప్పిందట. చివరి నిమిషంలో ఆ షాట్స్‌ను సినిమాలో జత చేస్తే, గందరగోళానికి గురయ్యే అవకాశం కూడా ఉందని చిత్ర బృందం భావించింది. రెండోసారి సరి చూసుకునే అవకాశం కూడా లేకపోతే, అంత పెద్ద సినిమా తీసి, అభాసుపాలవుతామని ప్రశాంత్‌ నీల్‌ భావించారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ‘సలార్‌’ విడుదల వాయిదా వేయాలని ప్రశాంత్‌ నిర్ణయించారట. ‘RRR’ విషయంలో ఇలానే జరిగింది. సంక్రాంతికి వస్తామని విడుదల తేదీ ప్రకటించిన తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో రాజమౌళి రాజీపడకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు ‘సలార్‌’ విషయంలో ప్రశాంత్‌నీల్‌ ఎక్కడ రాజీపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విడుదల తేదీపై మౌనం ఎందుకు?

విడుదల తేదీ వాయిదా విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, ఆ తేదీకి ఐదారు సినిమాలు వస్తుండటంతో ‘సలార్‌’ ఖరారైనట్లే. ఆ విషయాన్ని కూడా చిత్ర బృందం చెప్పకపోవడంతో ప్రభాస్‌ (Prabhas) అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వాయిదా పడితే, ఆ విషయానైనా చెప్పొచ్చు కదా అంటూ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా ట్వీట్లు పెడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. నవంబరులో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్‌. ఒకవేళ ఇదే నిజమైతే, ఇప్పుడే ఈ విషయమై స్పందించడం అనవసర చర్చకు దారితీస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా టీజర్‌, ట్రైలర్‌తో పాటు, కొన్ని సర్‌ప్రైజ్‌లను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు జోడీ శ్రుతిహాసన్‌ నటించనున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని