Tiger 3: ఓటీటీలో అదరగొడుతున్న ‘టైగర్‌3’.. సల్మాన్‌-షారుక్‌ సీన్‌ తీశారిలా!

Tiger3: సల్మాన్‌, కత్రినా జంటగా నటించిన ‘టైగర్‌3’ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Published : 14 Jan 2024 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) కథానాయకుడిగా మనీశ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌3’ (Tiger3). కత్రినాకైఫ్ కథానాయిక. నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ముఖ్యంగా సల్మాన్‌ అభిమానులతో పాటు, యాక్షన్‌ ప్రియులను అలరించింది. ఇటీవల ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ‘టైగర్‌3’ దూసుకుపోతోంది. వివిధ దేశాల్లో రికార్డు స్థాయి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, యూఏఈ, సింగపూర్‌, మలేషియా, ఒమన్‌, ఖతార్‌ తదితర దేశాల్లో ఎక్కువ మంది వీక్షిస్తున్న టాప్‌-10 ఓటీటీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్‌ తన యాక్షన్‌తో అదరగొట్టారు. షారుక్‌ఖాన్‌ కూడా అతిథి పాత్రలో మెరిశారు. ఇద్దరూ కలిసి నటించిన యాక్షన్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ బ్రేక్‌ డౌన్‌ వీడియోను కూడా యశ్‌ రాజ్‌ఫిల్మ్‌ ఇటీవల విడుదల చేసింది. సల్మాన్‌-షారుక్‌ల మధ్య సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు? వాటికి వీఎఫ్‌ఎక్స్‌ జోడించిన తర్వాత ఎంత థ్రిల్లింగ్‌గా మారాయి? తదితర అంశాలతో కూడిన వీడియో ఆద్యంతం అలరిస్తోంది.

టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌

మరోవైపు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ (Tiger vs Pathaan). సల్మాన్‌-షారుక్‌ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. భారీ బడ్జెట్‌, అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌తో ఈ మూవీని తీర్చిదిద్దనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని