Samantha Health Podcast: ఏడాదిన్నరగా పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నా: సమంత

ఆటో ఇమ్యూనిటీతో ఏడాదిన్నరగా బాధ పడుతున్నట్లు సమంత తెలిపారు.

Updated : 22 Mar 2024 23:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిటడెల్‌ కోసం ఎంతో కష్టపడినట్లు సమంత (Samantha Ruth Prabhu) చెప్పారు. ఒకవైపు మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే అప్పటివరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి తాజాగా హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ సిరీస్‌లో(Health Podcast) వివరించారు. ‘మై జర్నీ విత్ ఆటోఇమ్యూనిటీ’(Autoimmunity) పేరుతో ఇది యూట్యూబ్‌లో విడుదలైంది. అందులో న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానమిచ్చారు.

ఆటోఇమ్యూనిటీని ఎలా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నారు?

ఇది ఎంతో కష్టమైన పని. ఏ వారానికి ఆ వారం తగ్గుతుందిలే అనుకున్నా. నాకే ఎందుకు వచ్చింది అని ఎన్నోసార్లు బాధ పడ్డాను. దీని విషయంలో ఎంతో గిల్టీగా ఫీలయ్యా. ఏడాదిన్నరగా దీనితో పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నా. మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చని అర్థం చేసుకున్నా. ప్రతిఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి. ఓర్పుతో ముందుకు వెళ్తే జీవితం అందంగా ఉంటుంది. నాకు వచ్చిన వ్యాధి తగ్గడానికి సమయం పడుతుందని తెలుసు. కోలుకోవడానికి ఏం చేయాలో దాన్ని శ్రద్ధగా చేస్తున్నా.

సినిమాలకు విరామం తీసుకోవడం గురించి చెప్పండి?

13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఒకే సంవత్సరంలో 5 సినిమాలు (Movies) విడుదలైన సందర్భాలూ ఉన్నాయి. అంత బిజీగా ఉండే నేను బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం తేలికైన విషయం కాదు. నా జీవితంలో ఇప్పటివరకూ తీసుకున్న కఠిన, ఉత్తమమైన నిర్ణయమిదే. ఆరోగ్య పరిస్థితుల (Health Care) రీత్యా వర్క్‌ కంటిన్యూ చేయడం వీలుపడలేదు. పని పరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంత సులభం కాదు. వచ్చిన సమస్య మ్యాజిక్‌ చేసినట్లు తగ్గిపోతుంది అనుకోకూడదు. నేను ఇప్పటికీ ఎన్నో విషయాల్లో బాధపడుతూనే ఉన్నా. కానీ, ఎలాంటి సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నాను. 

‘సిటడెల్‌’ షూటింగ్‌ అనుభవం పంచుకోండి?

‘ఖుషి’ అవగానే పూర్తి సమయాన్ని సిటడెల్‌కు కేటాయించాను. ఇందులో ఎన్నో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. ఇది ఎంతో శారీరక శ్రమతో కూడినదని తెలిసినా ఓకే చెప్పా. దర్శక నిర్మాతలు ఎంతో సహకరించారు. ఈ సిరీస్‌ ఎంత కష్టపడి పూర్తి చేశానో నాకు తెలుసు. అందుకే ఇది ఎప్పటికీ ప్రత్యేకమైనదే. దీని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

వరుణ్‌ధావన్‌ (Varun Dhawan), సమంత (Samantha) జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Citadel: Honey Bunny) పేరుతో స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని