Satyadev: సహనాన్ని నేర్పింది ఆ ఆలస్యం

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు సత్యదేవ్‌. ఇటీవలే ‘గాడ్‌ఫాదర్‌’లో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు హీరోగా ‘గుర్తుందా శీతాకాలం’తో పలకరించనున్నారు.

Updated : 09 Dec 2022 06:52 IST

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు సత్యదేవ్‌ (Satyadev). ఇటీవలే ‘గాడ్‌ఫాదర్‌’లో (Godfather) ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు హీరోగా ‘గుర్తుందా శీతాకాలం’తో (Gurthunda Seethakalam) పలకరించనున్నారు. కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌గా రూపొందింది. నాగశేఖర్‌ తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సత్యదేవ్‌.

‘‘ఈ ఏడాదిలో నా నుంచి వస్తున్న ఐదో చిత్రమిది. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి (Chiranjeevi) అన్నయ్య ముందే చెప్పినట్లుగా ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంతో ద్వారా నేను మరింత మందికి చేరువయ్యా. ఇలాంటి తరుణంలో ‘గుర్తుందా శీతాకాలం’ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేనిందులో దేవ్‌ అనే పాత్రలో కనిపిస్తా. అతని జీవితంలోని నాలుగు ప్రేమకథల్ని ఈ చిత్రంలో చూపించనున్నాం.  ఇలాంటి సినిమా నేనిప్పటి వరకు చేయలేదు. తమన్నా పాత్ర ప్రవేశించాక ఈ చిత్ర స్వరూపమే మారిపోతుంది’’.

* ‘‘ఒక చిత్రంలో మూడు భిన్న వయసులున్న పాత్ర చేసే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకుల్ని ఒప్పించడానికి ఈ పాత్రల కోసం చాలా కష్టపడ్డా. తమన్నా ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుందని తెలియగానే షాకయ్యా. ఆమె ఇందులో నిధి అనే పాత్రలో కనిపిస్తుంది. ఇది కన్నడ చిత్రానికి రీమేక్‌ అయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మంచి మార్పులు చేశాం. ప్రేమకథా చిత్రాలు విశ్వజనీనమైనవి. అవి ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్య వచ్చిన ‘సీతారామం’, ‘లవ్‌టుడే’ వంటి చిత్రాల్ని ఆదరించినట్లే.. మా సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నా’’.

* ‘‘నేను ప్రస్తుతం ‘కృష్ణమ్మ’, ‘ఫుల్‌ బాటిల్‌’ చిత్రాలు చేస్తున్నా. డాలీ ధనంజయతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చేస్తున్నా. ఇవి కాకుండా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’.

* ‘‘ఏ చిత్రం చేసినా.. విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే చేస్తాము. ప్రతి సినిమాకీ ఒకే రీతిలో కష్టపడతాం. నా స్థాయి పెంచుకోవాలంటే ఇప్పుడు నేనొక పెద్ద థియేట్రికల్‌ హిట్‌ అందించాలి. ‘గాడ్సే’పై చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ, నా అంచనాలకు విరుద్ధంగా జరిగింది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా.. నేను ఆశావాద దృక్పథంతోనే జీవిస్తుంటా. ఈ చిత్ర విడుదల విషయంలో చాలా ఆలస్యం జరిగింది. అది నాకు సహనంగా ఎలా ఉండాలో నేర్పింది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని