Nandamuri Balakrishna: నవరసాల్ని రంగరించి తెరకెక్కించిన చిత్రమిది

‘సత్యభామ’గా సినీప్రియుల్ని అలరించనుంది కాజల్‌. ఆమె టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుమన్‌ చిక్కాల తెరకెక్కించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు.

Updated : 25 May 2024 12:34 IST

అనిల్‌ రావిపూడి, నవీన్‌ చంద్ర, కాజల్, బాలకృష్ణ, సుమన్‌ చిక్కాల, బాబీ, శ్రీనివాసరావు 

త్యభామ’గా సినీప్రియుల్ని అలరించనుంది కాజల్‌. ఆమె టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుమన్‌ చిక్కాల తెరకెక్కించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. నవీన్‌ చంద్ర ముఖ్య పాత్ర పోషించారు. శశికిరణ్‌ తిక్క సమర్పిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 

‘‘కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో ఓ వైబ్రేషన్‌ వస్తుంది. సత్యభామ అనే పేరు విన్నప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. ట్రైలర్‌లో కాజల్‌ ఫైట్లు, నటన అద్భుతంగా ఉన్నాయి. ‘భగవంత్‌ కేసరి’లో ఆమె పోషించిన పాత్రకిది పూర్తి భిన్నంగా ఉంది. ఉగాది పచ్చడిలాగా నవరసాల్ని రంగరించి ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం, విష్ణు ఛాయాగ్రహణం బాగున్నాయి. కచ్చితంగా ఇది ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ జానర్‌కు ఏం కావాలో అవన్నీ దీంట్లో చక్కగా కుదిరాయనిపించింది. ఈ సినిమాతో సుమన్‌ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మా ‘భగవంత్‌ కేసరి’తోనే మొదలైంది. ఆమె ఈ చిత్రంలో పోలీస్‌ యూనీఫాంలో చాలా బాగుంది’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. నటి కాజల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో నా కెరీర్‌లో ఓ కొత్త దశలోకి వెళ్తున్నాను. ఒక కొత్త బాధ్యత తీసుకుంటున్నాను. ఇలాంటి తరుణంలో మా వేడుకకు బాలకృష్ణ అతిథిగా రావడం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమాలో నేను ఫైట్స్‌ చేశాను. కొత్త ఎమోషన్‌ను అనుభూతి చెందాను. శశి నాకీ కథ వినిపించినప్పుడే దీనిపై నాకు నమ్మకం ఏర్పడింది. ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలయ్యాక ఆ నమ్మకం రెట్టింపయ్యింది. ఈ సినిమా కోసం దర్శకుడు సుమన్‌ చాలా కష్టపడ్డారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం, విష్ణు ఛాయాగ్రహణం అన్నీ బాగున్నాయి’’ అన్నారు. ‘‘చాలా మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది. తెరపై కాజల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చూసి ప్రేక్షకులు షాక్‌కు గురవుతారు. ఈ సినిమా కచ్చితంగా ఎవరినీ నిరుత్సాహపరచదు’’ అన్నారు నటుడు నవీన్‌ చంద్ర. చిత్ర సమర్పకుడు శశికిరణ్‌ తిక్క మాట్లాడుతూ.. ‘‘భావోద్వేగాలతో నిండిన పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు. 

‘‘ఈరోజుల్లో తన కలల్ని తను నిజం చేసుకోవడమే కష్టం. అలాంటిది శశికిరణ్‌ తిక్క దర్శకుడిగా తన కలను నిజం చేసుకోవడమే కాదు.. తనతో ప్రయాణం చేసిన నా కలను నెరవేర్చాడు. దర్శకుడిగా నా తొలి హీరో కాజల్‌. ఆమెని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ అన్నారు దర్శకుడు సుమన్‌. ఈ కార్యక్రమంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు, శ్రీచరణ్‌ పాకాల, రాంబాబు గోసాల, పవన్‌ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని