Sayaji Shinde: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వద్దు: సాయాజీ షిండే

తన ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చారు నటుడు సాయాజీ షిండే (Sayaji Shinde).

Updated : 14 Apr 2024 10:48 IST

ముంబయి: అనారోగ్యం కారణంగా ప్రముఖ నటుడు సాయాజీ షిండే (Sayaji Shinde) కొన్నిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌ ఇస్తూ తాజాగా ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు త్వరలోనే తిరిగి వస్తానన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ కామెంట్స్‌ పెట్టారు.

సాయాజీ షిండే ఈ నెల 11న ఛాతీ నొప్పితో ఇబ్బందిపడ్డారు. కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ‘‘సాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించాం. యాంజియోగ్రఫీ అనంతరం గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశాం’’ అని  వైద్యులు తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఠాగూర్‌’తో  ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలు పోషించారు. ‘గుడుంబా శంకర్‌’, ఆంధ్రుడు, ‘సూపర్‌’, ‘అతడు’, ‘రాఖీ’, ‘పోకిరి’, ‘దుబాయ్‌ శీను’, ‘నేనింతే’, ‘కింగ్‌’, ‘అదుర్స్‌’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని