shah rukh khan: ‘కింగ్‌’ షూటింగ్‌ త్వరలో?

గతేడాది వరుస విజయాలు అందుకున్న బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌.. తదుపరి ఎలాంటి కథతో తెరపైకి రాబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీప్రియులు. ఇటీవలే ఆయన, తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ఓ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Updated : 27 Feb 2024 09:29 IST

గతేడాది వరుస విజయాలు అందుకున్న బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌.. తదుపరి ఎలాంటి కథతో తెరపైకి రాబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీప్రియులు. ఇటీవలే ఆయన, తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ఓ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి ‘కింగ్‌’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుజోయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ‘‘కింగ్‌’ షూటింగ్‌ను మేలో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రంలో షారుక్‌, సుహాన మధ్య జరిగే యాక్షన్‌ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన స్టంట్స్‌ నేర్చుకోవడానికి కసరత్తులు ప్రారంభించింది సుహాన. ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో జరగనున్నాయి’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుంది.


 ‘జవాన్‌’ను మించేలా.. 

అట్లీ, షారుక్‌ ఖాన్‌ కలయికలో తెరకెక్కిన ‘జవాన్‌’ గతేడాది బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇందులో అదరగొట్టే యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు షారుక్‌. వీరిద్దరి కాంబినేషన్‌ మళ్లీ ఎప్పుడెప్పుడా?.. అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ తీపి కబురు వినిపించాడు దర్శకుడు అట్లీ. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన రాబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఎప్పటికైనా షారుక్‌తో సినిమా తీయాలనేది నా కల. నా అయిదో చిత్రంతోనే అది నెరవేరుతుందని అస్సలు ఊహించలేదు. మొత్తానికి ‘జవాన్‌’తో అది నిజమైంది. ఈసారి ‘జవాన్‌’ను మించిన కథతో మీ ముందుకు వస్తాం. త్వరలో ఆ స్క్రిప్ట్‌తో ఆయన దగ్గరికి వెళ్తాను. నాకు తెలుసు.. దీనిని కచ్చితంగా షారుక్‌ ఇష్టపడతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌ నటిస్తున్న ‘బేబీ జాన్‌’ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అట్లీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని