Dunki: కౌంట్‌డౌన్‌ మొదలు

షారుక్‌ ఖాన్‌.. ఈ ఏడాది వరస విజయాలతో హిట్‌ కొట్టిన కథానాయకుడీయన. ఇప్పుడు మరోసారి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించడానికి ‘డంకీ’ చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఆయన, తాప్సి జంటగా నటించిన చిత్రమిది. రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Updated : 15 Dec 2023 09:24 IST

షారుక్‌ ఖాన్‌.. ఈ ఏడాది వరస విజయాలతో హిట్‌ కొట్టిన కథానాయకుడీయన. ఇప్పుడు మరోసారి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించడానికి ‘డంకీ’ చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఆయన, తాప్సి జంటగా నటించిన చిత్రమిది. రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 21న రానున్న ఈ సినిమా కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు షారుక్‌. ‘హార్డి, మను సూటు బూటు వేసుకొని సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఎంతో దూరంలో లేరు. ఇంకో ఏడు రోజుల్లో మేము మిమ్మల్ని కలవబోతున్నాము. కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది’ అని వ్యాఖ్యల్ని జోడించారు. ఇంగ్లాండ్‌కి వెళ్లాలనుకునే ఐదుగురి స్నేహితుల కథను ఈ సినిమాలో చూపించనున్నారు.


డబ్బుతో మనిషి సంబంధం

యడ్లపల్లి మహేశ్‌, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్‌, చాందిని, సుదర్శన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్‌’. వెన్నెల కుమార్‌ పోతేపల్లి తెరకెక్కించారు. ముక్కాముల అప్పారావు, కోడూరు గోపాల కృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమిది. మనిషికి డబ్బుకు ఉన్న సంబంధాన్ని దర్శకుడు దీంట్లో ఆసక్తికరంగా చూపించారు. ఆ అంశం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌ సదాశివుని, పవన్‌, ఛాయాగ్రహణం: సతీశ్‌ రాజబోయిన.


మట్కా.. ప్రారంభం

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా కరుణ కుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మట్కా’. మోహన్‌ చెరుకూరి, విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ గురువారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 1958 - 1982 మధ్య కాలంలో జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీని కోసమే అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. అందులోనే ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోంది. ‘‘యావత్‌ దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీంట్లో వరుణ్‌ నాలుగు భిన్నమైన గెటప్‌లలో కనువిందు చేయనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందిస్తుండగా.. ఎ.కిషోర్‌ కుమార్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


‘సఖి’ ప్రేమాయణం

లోకేశ్‌ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘సఖి’. జానీ భాషా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్థురెడ్డి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కథ ఇది. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన కథలో ఎలాంటి మలుపులకి కారణమైందనేది ఆసక్తికరం. అనుభూతిని పంచే ఓ మంచి ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు. సందీప పసుపులేటి, సుధాకర్‌ రెడ్డి, జ్యోతి స్వరూప్‌, జితిన్‌ ఆదిత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీశ్‌ కుమార్‌ కారే, సంగీతం: సన్నీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని