Shah Rukh Khan: నావికాదళ మాజీ అధికారుల విడుదలతో సంబంధం లేదు: షారుక్‌ ఖాన్‌ టీమ్‌

నావికాదళ మాజీ అధికారుల విడుదలతో షారుక్‌ ఖాన్‌కు సంబంధంలేదని టీమ్‌ స్పష్టం చేసింది.

Published : 14 Feb 2024 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి, వారి రిలీజ్‌కు సాయం చేశారంటూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Shah Rukh Khan) ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ఆ కామెంట్‌ వైరల్‌ అయింది. దీనిపై షారుక్‌ టీమ్‌ స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలను ఖండించింది. ఈ వ్యవహారంలో షారుక్‌ ప్రమేయమేమీ లేదని స్పష్టం చేసింది. ఆ అధికారుల విడుదలపై అందరిలానే షారుక్‌ ఆనందంగా ఉన్నారని పేర్కొంది.

ఏఎఫ్‌సీ (Asian Football Confederation) ఫైనల్స్‌కు అతిథిగా షారుక్‌ కొన్ని రోజుల క్రితం ఖతార్‌ వెళ్లారు. ప్రధానమంత్రి షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ థానేను కలిశారు. దాంతో, అధికారుల విడుదల వ్యవహారంలో షారుక్‌ జోక్యం చేసుకున్నారంటూ పలువురు అభిప్రాయపడ్డారు.

గూఢచర్యం ఆరోపణల కింద ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని 2022లో ఖతార్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న మన విదేశాంగ శాఖ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్‌కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని