Shahid Kapoor: నటుల లుక్స్‌పై షాహిద్‌ కపూర్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్‌ కొందరు నటుల లుక్స్‌పై వ్యాఖ్యలు చేశారు.

Published : 09 Feb 2024 20:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) నటించిన తాజా చిత్రం ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ (Teri Baaton Mein Aisa Uljha Jiya). కృతి సనన్‌ హీరోయిన్‌. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో కొందరు నటుల లుక్స్‌పై కామెంట్‌ చేశారు. ‘‘కొందరు యాక్టర్స్‌ తాము నటించే ప్రతీ సినిమాలో ఒకే లుక్‌తో కనిపిస్తారు. నేను విభిన్న గెటప్పుల్లో కనిపించేందుకే ఇష్టపడతా. పాత్ర డిమాండ్‌ మేరకు ఏదైనా చేస్తా’’ అని పేర్కొన్నారు. అనంతరం, ‘హౌజ్‌పార్టీకి ఆహ్వానించాల్సి వస్తే ఎవరిని ఆహ్వానిస్తారు?’ అని హోస్ట్‌ అడగ్గా.. కృతి సనన్‌ (Kriti Sanon) పేరు ముందుగా ప్రస్తావించారు. రెండో స్థానం కియారా ఆడ్వాణీ (Kiara Advani)కి ఇచ్చారు.

‘కబీర్‌సింగ్‌’ (అర్జున్‌ రెడ్డి రీమేక్‌), ‘జెర్సీ’ (జెర్సీ రీమేక్‌), ‘బ్లడీ డాడీ’ (తూంగా వనం రీమేక్‌).. ఇలా వరుస రీమేక్స్‌తో ప్రేక్షకులను అలరించిన షాహిద్‌.. ‘తేరీ బాతో...’తో ఇప్పుడు సందడి చేస్తున్నారు. అమిత్‌ జోషి, ఆరాధన సాహ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో షాహిద్‌ రోబో సైంటిస్ట్‌గా, కృతి సనన్‌ రోబోగా నటించి, మెప్పించారు. రోబోని ప్రేమించిన సైంటిస్ట్‌ పరిస్థితేంటి? అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించడంపై షాహిద్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘కొన్నాళ్లుగా నేను పూర్తిస్థాయి ప్రేమ కథల్లో నటించడం లేదు. ఒకే రకమైన చిత్రాలు చేస్తున్న తరుణంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది. అప్పుడే ఈ సినిమా అవకాశం వచ్చింది. చాలా విభిన్నమైన కథ ఇది’’ అని అన్నారు. ప్రస్తుతం.. ఆయన ‘దేవా’ చిత్రంలో నటిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని