Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్‌ చరణ్‌ చిత్రంపై శివ రాజ్‌కుమార్‌

హీరో రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ ప్రశంసలు కురిపించారు.

Published : 21 Mar 2024 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న #RC16 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా మరో స్థాయిలో ఉంటుందని ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) చెప్పారు. బుచ్చిబాబు విజన్‌ ఉన్న డైరెక్టర్‌ అని కొనియాడారు. తనకు స్క్రిప్టు నెరేట్‌ చేసేందుకు సంప్రదించగా దర్శకుడికి అరగంట సమయం ఇచ్చానని, ఆయన వివరించే తీరు బాగుండడంతో గంటన్నరపైగా కేటాయించానని తెలిపారు. కథ, అందులోని పాత్రలను ఆయన చక్కగా రాశారని పేర్కొన్నారు. రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటుడని, మంచి మనిషని ప్రశంసించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘ఆర్సీ 16’లో శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ‘ఉప్పెన’తో తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ అందుకున్న దర్శకుడే బుచ్చిబాబు. ఈయన రామ్‌ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటన వెలువడడమే ఆలస్యం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి, దర్శకులు శంకర్‌, సుకుమార్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, బోనీ కపూర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)లో నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్‌.జె సూర్య, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని