Dacoit: డకాయిట్‌.. దొంగనా? విలనా?

దొంగనా? విలన్‌నా? నేనెవర్ని? అంటూ ప్రశ్నిస్తున్నాడు అడివి శేష్‌. మరి దీనికి సమాధానం తెలియాలంటే ‘డకాయిట్‌’ విడుదల వరకు ఆగాల్సిందే. అడివి శేష్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.

Updated : 21 Dec 2023 09:28 IST

దొంగనా? విలన్‌నా? నేనెవర్ని? అంటూ ప్రశ్నిస్తున్నాడు అడివి శేష్‌. మరి దీనికి సమాధానం తెలియాలంటే ‘డకాయిట్‌’ విడుదల వరకు ఆగాల్సిందే. అడివి శేష్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాత. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘డకాయిట్‌... ఒక ప్రేమకథ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇందులో ‘జూలియట్‌.. ఎన్నేళ్లయింది? మనం కలిసి. అసలు నేను నీకు గుర్తున్నానా?...’ అంటూ కథానాయకుడు, ‘నీ మోసం మరిచిపోలేదు...’ అంటూ కథానాయిక చెప్పే సంభాషణలు టీజర్‌ని ఆసక్తికరంగా మార్చాయి. అడివి శేష్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ గొప్ప అనుభూతిని పంచుతుంది. వాళ్లు పెద్ద తెరపై ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని షానీల్‌ డియో తన అద్భుతమైన విజన్‌తో ఆవిష్కరిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునే స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. భారతదేశంలోని అరుదైన గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ‘‘అరుదైన ఈ ప్రేమకథలో భాగం కావడం సంతోషంగా ఉంద’’న్నారు శ్రుతిహాసన్‌. దర్శకుడిగా తాను పరిచయం కావడానికి సరైన చిత్రం ఇదే అన్నారు షానీల్‌ డియో. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్‌, షానీల్‌ డియో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు