Siddhu jonnalagadda: టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!

‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు.

Updated : 29 Mar 2024 11:50 IST

‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ.

‘డీజే టిల్లు’తో పోల్చితే ఈ ‘టిల్లు స్క్వేర్‌’ విషయంలో బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నట్లున్నారు?

‘‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో దానిపై పెద్దగా అంచనాల్లేవు. అలాగే హీరో పాత్ర ఎలా ఉంటుందనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కాకపోతే ఇప్పుడా పాత్ర ఏంటి? అదేలా వ్యవహరిస్తుంది? అన్నది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడదే పాత్రతో మరోసారి మ్యాజిక్‌ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. అయితే మేము ఆ ఒత్తిడిని జయించి మరో మంచి సినిమాని అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. కచ్చితంగా మా ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుంది’’.

ఇది టిల్లు పాత్రకు కొనసాగింపుగా ఉంటుందా? లేక కథకు కొనసాగింపుగా ఉంటుందా?

‘‘రెండింటికీ కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటే కథ కొనసాగింపు కొంత వరకు ఉంటుంది. అయితే అది పాత కథను అక్కడక్కడా గుర్తు చేస్తూనే ఆద్యంతం ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. టిల్లు పాత్ర కూడా ఈ సీక్వెల్‌లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే తను ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటనేది నేను చెప్పను కానీ, థియేటర్లలో చూసి చాలా ఎంజాయ్‌ చేస్తారు. బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఉంటాయి. సినిమా అంతా ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటూనే ఉంటారు. నిజానికి సినిమాలో టిల్లు ఎక్కడా నవ్వడు. వాడి బాధ వాడు పడుతుంటాడు. కానీ, తన బాధ కూడా అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటుంది’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో కామెడీ యాక్షన్‌ చిత్రం చేస్తున్నా. అలాగే నీరజ కోనతో ‘తెలుసు కదా’ చేస్తున్నా. నందిని రెడ్డి సినిమాకి సంబంధించి స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి’’.


అనుపమ బాధపడింది

‘‘మనం ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు యూట్యూబ్‌లో దాని కింద కామెంట్స్‌ వస్తుంటాయి. అందులో వచ్చే నెగటివ్‌ కామెంట్స్‌ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మొన్న ట్రైలర్‌ విడుదలైనప్పుడు చాలా మంది కామెంట్స్‌ పెట్టారు. ‘గత ట్రైలర్‌ కంటే ఇది అదిరిపోయింది’’ అని కొంతమంది పెట్టారు. అందుకు సంతోషించా. ‘పక్కా అట్టర్‌ ఫ్లాప్‌’ అని ఇంకొకరన్నారు. అది చూడగానే సంతోషం మొత్తం నీరు కారిపోయింది. ఇటీవల విడుదలైన మా సినిమా పోస్టర్స్‌ విషయంలో అనుపమపై కొంతమంది కామెంట్స్‌ చేశారు. వాటి వల్ల ఆమె ఎంతో బాధపడింది. మహిళల గురించి కామెంట్స్‌ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని