silence2: ముగింపు రాసే అవినాష్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైలెన్స్‌ 2’.

Updated : 04 Apr 2024 09:43 IST

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైలెన్స్‌ 2’. అబన్‌ భరూచా దేవహంస తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌, క్యాండిడ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ సినిమాలో ఏసీపీ అవినాష్‌ వర్మగా మనోజ్‌ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘గడియారం చేసే చప్పుడు మనసులో ఉద్రిక్తతను పెంచుతోంది. గందరగోళంగా ఉన్న ఈ నగరంలో హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఏసీపీ అవినాష్‌, అతని స్పెషల్‌ క్రైమ్‌ యూనిట్‌ ఈ మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నారు’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. నగరంలోని ఓ బార్‌లో కాల్పులు జరగడం, అందుకు కారణమైన క్రిమినల్‌ని పట్టుకునేందుకు అవినాష్‌ తన బృందంతో రంగంలోకి దిగడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఈ కథను నడిపించే దర్శకుడు ఎవరైనా సరే దీనికి ముగింపు మాత్రం మనమే రాయాలి’ అంటూ చివర్లో మనోజ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ప్రాచీ దేశాయ్‌, సహిల్‌ వేద్‌ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 16న ఓటీటీలో విడుదల కానుంది.


ప్రేమకథ మొదలైంది

ర్శకుడు త్రినాథరావు నక్కిన చిత్ర  నిర్మాణంలోకి అడుగు పెట్టారు. నక్కిన నెరేటివ్స్‌ పతాకంపై విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్తర్‌ అనిల్‌ కథానాయిక. తారక్‌ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు సందీప్‌కిషన్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత శరత్‌ మరార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మరో  కథానాయకుడు  సుమంత్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘ఇదొక టౌన్‌లో జరిగే అందమైన ప్రేమకథ. కథ అద్భుతంగా వచ్చింది. మంచి నటులు, సాంకేతిక బృందం తోడైంది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మళ్ల మాట్లాడుతూ ‘‘త్రినాథరావు నక్కిన ఎంతో ప్రేమించి రాసుకున్న కథని నా చేతిలో పెట్టారు. వందశాతం కష్టపడి ఆయన అనుకున్నదానికంటే మంచి సినిమాని ఇస్తా. విక్రమ్‌కి తగిన పాత్ర ఇది. తను ఈ సినిమాతో కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఎస్తర్‌, తారక్‌ పొన్నప్ప పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ఎవరూ ఊహించని జానర్‌ చిత్రం అవుతుంది. రెగ్యులర్‌ చిత్రీకరణ ఈ నెల నుంచే మొదలు పెడుతున్నాం’’ అన్నారు. త్రినాథరావు నక్కిన సంస్థలో భాగం కావడం ఆనందంగా ఉందని నాయకానాయికలు అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మాయ.వి, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ప్రొడక్షన్‌ డిజైన్‌: రఘు కులకర్ణి, సంభాషణలు: నరేశ్‌ తుల, రాజేంద్రప్రసాద్‌, సంగీతం: డేవ్‌జాంద్‌.


తరాన్ని మేల్కొలిపే ఉద్యమం

కొంత విరామం తర్వాత ఓ మంచి కథతో ‘జితేందర్‌ రెడ్డి’ తీశానన్నారు విరించి వర్మ.  బలమైన భావోద్వేగాలు, డ్రామాతో చేసిన సినిమా ఇదన్నారు. ఆయన దర్శకత్వంలో... రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మాత. రియా సుమన్‌, ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజు, రవి ప్రకాశ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 1980 నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. బుధవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొపాలి...’ అంటూ మొదలైన ప్రచార చిత్రం ఆసక్తికరంగా సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్‌ ఫోన్‌ చేసి ‘ఒక కథ ఉంది, దర్శకత్వం చేయాలి’ అని చెప్పారు. కథ వినడానికి వెళ్లినప్పుడు ఓ పుస్తకం  ఇచ్చి ఇది చదవండని చెప్పారు.  అది చదివాక ఇలాంటి శక్తివంతమైన పాత్రతో సినిమా చేయాల్సిందే అనిపించింది. జితేందర్‌ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన గ్రామానికి  వెళ్లి ఆయన స్నేహితుల్ని, అక్కడి ప్రజల్ని కలిశాక ఎన్నో విషయాలు తెలిశాయి. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అన్నారు. నటుడు రవి ప్రకాశ్‌తోపాటు  చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.


సిద్ధహస్త... ప్రభుదేవా

‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’...9వ శతాబ్దానికి చెందిన ఓ క్రైస్తవ మతగురువు చుట్టూ తిరిగే కథనంతో తెరకెక్కుతున్న మలయాళ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా రానున్న ఈ సినిమాను రోజిన్‌ థామస్‌ రూపొందిస్తున్నారు. అనుష్క ఈ సినిమాతో మలయాళంలో అడుగుపెట్టనుంది. జయసూర్య, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించనున్నారు. బుధవారం ప్రభుదేవా పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్‌లుక్‌ను సిద్ధహస్తుడు అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. పొడవాటి జుట్టు, వింత వేషధారణ, చిరునవ్వుతో ఉన్న ప్రభుదేవా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ పీరియాడిక్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ రెండు భాగాలుగా 14 భాషల్లో విడుదల కానుంది. గోకులం గోపాలన్‌ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని