Sonali Bendre: ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు.

Published : 20 Apr 2024 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా అగ్రహీరోలందరితో నటించి మెప్పించారు నటి సోనాలి బింద్రే (Sonali Bendre). పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ సీజన్‌2తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. జీ5 వేదికగా మే3 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో తాను నటించిన ఓ సినిమా నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన ఫేక్‌ న్యూస్‌లపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘నేను నటించిన ‘డూప్లికేట్‌’ చిత్రం నాకు వృత్తిపరంగా ఎన్నో పాఠాలు నేర్పింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాలని.. అది సినిమాకు ఎంతో కీలకమని చిత్రబృందం చెప్పింది. అందులో నటించడం సవాలుగా అనిపించి షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆత్రుతగా ఎదురుచూశా. కానీ, చిత్రీకరణ మొదలుపెట్టాక నేను చేస్తున్నది కీలకపాత్ర కాదని.. కార్టూన్‌ వంటిదేననే భావన కలిగింది. కథను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని తెలుసుకున్నా. అప్పటి నుంచి వచ్చిన పాత్ర గురించి లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నా. ఇప్పటికీ ఎవరైనా ఆ సినిమా పాటలు ప్లే చేసినా.. దాని ప్రస్తావన తెచ్చినా నాకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాక అలాంటి వాటిని ఎంచుకోకుండా జాగ్రత్త పడుతున్నా’’ అని చెప్పారు. 1998లో విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ ప్రధానపాత్రలో నటించగా జూహీ చావ్లా, సోనాలి కీలకపాత్రలు పోషించారు.

ఇటీవల వైరలవుతోన్న ఫేక్‌ న్యూస్‌ల గురించి సోనాలి స్పందిస్తూ.. ‘రూమర్స్‌, ఫేక్ న్యూస్‌ సృష్టించడం చాలా తేలిక. సినీ పరిశ్రమలో ఉన్నవారిపై ఇలాంటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులుగా ఇవి నియంత్రణలోనే ఉన్నాయనిపిస్తుంది. సాంకేతికతను ఉపయోగించి నకిలీ వార్తలను సులభంగా గుర్తించగలుగుతున్నారు. గతంలో ఏదైనా నకిలీనా.. కాదా అని తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టేది.. ఇప్పుడు 10 నిమిషాల్లో తెలుసుకోగలుగుతున్నారు’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని