Tanikella Bharani: నన్ను మా నాన్న చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలూ ఉన్నాయి: తనికెళ్ల భరణి

నటుడు తనికెళ్ల భరణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 

Published : 12 Apr 2024 19:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తాను చిన్నతనంలో ఎంతో అల్లరి చేసినట్లు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘‘చిన్నతనంలో చాలా అల్లరి చేశాను. బ్యాడ్‌ స్టూడెంట్‌ని. నా గోల తట్టుకోలేక మా నాన్న నన్ను చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జామ్‌ పేపర్‌ మీద మార్కులు వేసినప్పుడు.. నేను వాటిని మార్చకుండా ఉండేలా పక్కన గీతలు పెట్టేవాళ్లు. నాకు ఇప్పటికీ డబ్బులు లెక్కపెట్టడం రాదు. సినిమా రంగంలో ఉన్నప్పుడు అన్నిటికీ సర్దుకోవాలి. ఒక్కోసారి లగ్జరీ హోటల్లో ఉండాల్సి వస్తుంది. అలాగే షూటింగ్స్‌ సమయంలో శ్మశానం పక్కన తినాల్సి వస్తుంది. అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండాలి. దర్శక నిర్మాతలు రూమ్స్‌ బుక్‌ చేసినప్పుడు అవి బాగాలేవని కొందరు కామెంట్స్‌ చేస్తారు. నేనెప్పుడూ అలా కామెంట్స్‌ చేయలేదు’’

‘‘నేను పూజలు మానేసి 15 ఏళ్లు అవుతుంది. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తుంటాను. చేస్తున్న పనిలో వందశాతం మనసును నిమగ్నం చేయడం కూడా నా దృష్టిలో ధ్యానమే. కష్టంలో ఉన్నవారికి సాయం చేయడమే పుణ్యం. మరొకరిని మానసికంగా బాధ పెట్టడమే పాపం. ప్రతిఒక్కరూ మరణం గురించి ఆలోచించి తీరాలి. ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా నేను దీని గురించే ఆలోచిస్తుంటాను. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదు.. ఉన్నన్ని రోజులు ఎంత ఆనందంగా ఉన్నామనేది ముఖ్యం. నేను నా మనసుకు నచ్చినట్లు ఉంటాను. రచించడం, నటించడం, దర్శకత్వం వహించడం ఈ మూడు నాకు ఇష్టమే. వీటిల్లో ఏది ఎక్కువ అంటే చెప్పలేను. ఏది చేసినా ఎంజాయ్‌ చేస్తుంటాను’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని