Tollywood: ఈ ఏడాది విందు భిన్న రుచులతో పసందు

చిత్రసీమ ట్రెండ్‌ని సృష్టించడం కంటే...అనుసరించడమే ఎక్కువ. ఓ సినిమా విజయం సాధించిందంటే... అలాంటి కథలే పదుల సంఖ్యలో సిద్ధమవుతుంటాయి. చిత్రసీమలో అందరి లక్ష్యం విజయమే కాబట్టి... విజయవంతమైన చిత్రాల్ని, ప్రయత్నాల్ని అనుసరించే ధోరణిలోనే కనిపిస్తుంటుంది.

Updated : 23 Dec 2023 09:23 IST

వైవిధ్యమైన చిత్రాలెన్నో వెండి తెరపై

చిత్రసీమ ట్రెండ్‌ని సృష్టించడం కంటే...అనుసరించడమే ఎక్కువ. ఓ సినిమా విజయం సాధించిందంటే... అలాంటి కథలే పదుల సంఖ్యలో సిద్ధమవుతుంటాయి. చిత్రసీమలో అందరి లక్ష్యం విజయమే కాబట్టి... విజయవంతమైన చిత్రాల్ని, ప్రయత్నాల్ని అనుసరించే ధోరణిలోనే కనిపిస్తుంటుంది. ఇలాంటి పరిణామాలతోనే కథలు, పాత్రలు అప్పుడప్పుడూ ఒకే మూసలో సాగుతుంటాయి. నేటితరం సినీ రూపకర్తలు అలా మూస పద్ధతుల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడటం లేదు. నిర్మాతల్ని, హీరోల్ని ఒప్పిస్తూ ధైర్యంగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండ్‌, కల్ట్‌ అనే మాటలు చిత్రసీమలో విరివిగా వినిపిస్తున్నాయంటే అదే కారణం. 2023లో తెరపైకొచ్చిన కథలు... వాటి రకాల్ని గమనిస్తే వినోదాల రుచులు ఎన్నెన్నో!

తెలుగు చిత్రసీమ అంటే ఒకప్పుడు మాస్‌ మసాలా సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడలా ఒక మాటలో తేల్చేయగలమా? అగ్ర కథానాయకుల సినిమాలు దాదాపు ఒకే ఫార్ములాతో రూపొందేవి. మరిప్పుడూ? కొత్త ప్రయత్నాలకి ఏమాత్రం వెనకాడటం లేదు. అందుకే ఏటా కొత్త రకమైన కథలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. విజయాలతో సంబంధం లేకుండా తాము నమ్మిన కథలతో ప్రయాణం చేస్తున్నారు కథానాయకులు, దర్శకనిర్మాతలు. ఫలితంగా ప్రేక్షకులకు భిన్న రకాల సినిమాల్ని ఆస్వాదించే వీలు కలుగుతోంది. పీరియాడిక్‌ కథలు, థ్రిల్లర్లు, మన మార్క్‌ మాస్‌  మసాలా, యాక్షన్‌ కథలు, ప్రేమకథలు, కుటుంబ కథలు, రొమాంటిక్‌, కామెడీ కథలు, హారర్‌ చిత్రాలు, నాయికా ప్రధానమైన చిత్రాలు, చరిత్ర, జీవిత కథలు... ఇలా ఎన్నెన్నో. విజయాల సంగతి పక్కనపెడితే అసలు మనం స్పృశించని కథలంటూ లేవేమో అనేలా ఈ ఏడాది చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే చూస్తారని ఇదివరకటిలా ఇప్పుడు వాళ్లకి వాళ్లు పరిమితులు విధించుకోవడం లేదు దర్శకులు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావంతో కథలపై పెద్ద చర్చే జరిగింది.  ఇదివరకటిలాగా మాస్‌ కథలు తీస్తే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదనే మాటలు వినిపించాయి. కానీ ఆ కథల్నీ కొత్తగా నేటితరం అభిరుచులకి తగ్గట్టుగా చూపిస్తే చాలని ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు నిరూపించాయి. పక్కా మన మార్క్‌ మాస్‌ కథలతో ఆ సినిమాలు రూపొందాయి. రూ.వందల కోట్లు వసూళ్లు సాధించాయి ఆ సినిమాలు. నాని, అల్లరి నరేశ్‌, రామ్‌, వైష్ణవ్‌తేజ్‌ తదితర యువ కథానాయకులు సైతం ఈ ఏడాది మాస్‌ అవతారాన్ని ప్రదర్శించారు. ఆదిపురుషుడు శ్రీరాముడిగా కనిపించి నవతరానికి రామాయణాన్ని గుర్తు చేసిన ప్రభాస్‌, ‘సలార్‌’తో తన మార్క్‌ యాక్షన్‌ హంగామా సృష్టిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’గా తనదైన శైలిలో సందడి చేసి మెప్పించిన బాలకృష్ణ, ‘భగవంత్‌ కేసరి’తో తన కోసం ఇలాంటి సామాజికాంశాలతో కూడిన కథల్నీ సిద్ధం చేయొచ్చని చాటి చెప్పారు. ‘దసరా’తో ఊర మాస్‌ అనిపించిన నాని, ఆ వెంటనే కథల ఎంపికలో తన అభిరుచిని ప్రదర్శిస్తూ ‘హాయ్‌ నాన్న’తో భావోద్వేగాల్నీ పంచారు. ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి కానీ ‘స్కంద’తో రామ్‌, ‘ఆదికేశవ’తో వైష్ణవ్‌తేజ్‌ కూడా కత్తులు చేతపట్టి హంగామా చేశారు. ‘ఉగ్రం’ సినిమాతో అల్లరి నరేశ్‌ కొత్త కోణంలో కనిపించారు.


ఫాంటసీ... థ్రిల్‌

సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ కథతో పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ‘బ్రో’ చేశారు. అందులో తాత్వికత ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. థ్రిల్లర్‌ కథల్ని స్పృశించడంలోనూ మన చిత్రసీమ ముందుంది. మిస్టిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పీరియాడిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవితేజ ‘రావణాసుర’తో థ్రిల్‌ చేసే ప్రయత్నం చేశారు కానీ, ఫలించలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డెవిల్‌’తో కల్యాణ్‌రామ్‌ స్పై థ్రిల్లర్‌ కథని స్పృశించారు. హారర్‌ అంశాలతో ‘మా ఊరి పొలిమేర 2’, ‘మంగళవారం’, ‘పిండం’ తదితర చిత్రాలొచ్చాయి. పురాణాల ఆధారంగా సమంత ‘శాకుంతలం’ రూపొందింది. జీవిత కథగా రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.


కామెడీ కథలు

నవ్వించడమే లక్ష్యంగా చేసిన చిత్రాలూ కొన్ని ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన  ‘మ్యాడ్‌’ ప్రేక్షకుల్ని నవ్వించి విజయాన్ని సొంతం చేసుకుంది. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తూ, నటించిన ‘కీడా కోలా’ ప్రేక్షకుల్ని నవ్వించింది. రొమాంటిక్‌ కామెడీ కథగా తెరకెక్కిన నవీన్‌ పొలిశెట్టి, అనుష్కల ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఈ ఏడాది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  కామెడీ డ్రామాతో రూపొందిన ‘బెదురులంక 2012’ చిత్రానికీ ఓ మాదిరి విజయం దక్కింది.  మానవ సంబంధాల్ని తెరపై ఆవిష్కరిస్తూ వేణు యెల్దండి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది కానీ భావోద్వేగాల్ని పంచి విమర్శకుల మెప్పు పొందింది. మానవ సంబంధాల చుట్టూ అల్లిన ‘మంత్‌ ఆఫ్‌ మధు’ కూడా ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ చిత్రాలన్నీ ఒకెత్తైతే, ‘బేబి’ మరో ఎత్తు. నవతరం జీవన శైలికి అద్దం పడుతూ రూపొందిన ‘బేబి’ కథల విషయంలో సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతూ, భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ విజయవంతమైన ప్రేమకథగా నిలిచింది. ధనుష్‌ నటించిన ‘సార్‌’ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కొత్తతరం కథల హవా కొనసాగుతోంది. ‘ఉస్తాద్‌’, ‘విమానం’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘హంట్‌’, ‘7:11 పి.ఎమ్‌’... ఇలా ఎన్నో కొత్త ప్రయత్నాలకి తెలుగు సినిమా ఈ ఏడాది వేదికైంది. కొన్ని కథలు పాతవే కావొచ్చు, కానీ వాటిని కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాల్ని మాత్రం పరిశ్రమలో అప్పుడున్న పరిస్థితులే ప్రభావితం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని