Tollywood: విజయాల జోరు.. కొనసాగింపులో హుషారు

విజయవంతమైన సినిమాకి కొనసాగింపు అనగానే ఎన్నో భయాలు... మరెన్నో అనుమానాలు! తొలి భాగంలోని మ్యాజిక్‌ మరోసారి పునరావృత్తం అవుతుందా?

Updated : 02 Apr 2024 09:36 IST

విజయవంతమైన సినిమాకి కొనసాగింపు అనగానే ఎన్నో భయాలు... మరెన్నో అనుమానాలు! తొలి భాగంలోని మ్యాజిక్‌ మరోసారి పునరావృత్తం అవుతుందా? తొలి సినిమా స్థాయి అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తే వాటిని అందుకోగలమా? ఇలా ఎన్నో లెక్కలు, భయాలు. వాటన్నిటికీ సరైన సమాధానం దొరికితే తప్ప దర్శకనిర్మాతల అడుగు ముందుకు పడదు. కొనసాగింపు చిత్రాల విజయాల శాతం తక్కువగా ఉండటం...మ్యాజిక్‌ మళ్లీ మళ్లీ జరిగేది కాదనే అభిప్రాయాలతో వాటిని చేయడం ఓ సాహసంలాగే పరిగణిస్తుంటారు. అయితే ఈ మధ్య ఆ లెక్క మారింది. కొనసాగింపు చిత్రాలు అదరగొడుతున్నాయి. దాంతో మరింత ఉత్సాహంగా దర్శకనిర్మాతలు కథల్ని కొనసాగిస్తున్నారు.

సీక్వెల్‌ చిత్రాలు... ఫ్రాంచైజీ చిత్రాలు అంటూ కథలు, పాత్రలు కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదాలు పంచుతుంటాయి. మార్కెట్‌ పరంగా ఈ సినిమాకి ఎన్నో ప్రయోజనాలు. సులభంగా ప్రచారం లభిస్తుంది. ప్రేక్షకుల్లో ముందుగానే ఆసక్తిని రేకెత్తించి థియేటర్‌కి ఆకర్షిస్తాయి. ఆ తర్వాతే అసలు పరీక్ష. తొలి భాగానికి ఏమాత్రం తగ్గినా ప్రేక్షకుడి నుంచి తిరస్కరణ తప్పదు. అలా అంచనాల్ని అందుకోలేక చతికిలపడిన సినిమాలు ఎన్నో. ఫలితంగా కొన్నేళ్ల కిందట వరకూ కొనసాగింపు తీయాలంటే భయపడిపోయేవాళ్లు. అయితే ఈమధ్య చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాల్ని సొంతం చేసుకోవడంతో కొనసాగింపులపై ఉన్న భయాలు తొలగిపోయాయి. ‘ఆర్య2’తో మొదలుపెడితే ఈ శుక్రవారం వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ వరకూ పలు చిత్రాలు విజయవంతంగా అంచనాల్ని అందుకున్నాయి.  ‘బాహుబలి 2’, ‘దృశ్యం 2’, ‘కార్తికేయ 2’, ‘హిట్‌ 2’, ‘బంగార్రాజు’, ‘కె.జి.ఎఫ్‌ 2’ తదితర విజయాలు నవతరం సినీ రూపకర్తల్ని  కొనసాగింపు చిత్రాలపై మరింత మక్కువ ప్రదర్శించేలా చేశాయి.


 సెట్స్‌పై అరడజను పైగా...

హిందీలోనూ, ఇతర పొరుగు భాషల్లో కొనసాగింపు చిత్రాలు నిత్యం తెరకెక్కుతూనే ఉంటాయి. అక్కడ ఆ సినిమాలకి విజయాల శాతం ఎక్కువ. ఈమధ్య వచ్చిన విజయాలతో తెలుగులోనూ ఆ చిత్రాల హవా సాగుతోంది. ప్రస్తుతం సెట్స్‌పై అరడజనుపైగా సీక్వెల్‌ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. ‘పుష్ప2’, ‘సలార్‌2’, ‘గూఢచారి2’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’... ఇవన్నీ కూడా కొనసాగింపు చిత్రాలే. ఎన్టీఆర్‌ ‘దేవర’ కూడా రెండు భాగాలుగా రూపొందుతోంది. ‘మ్యాడ్‌’ సినిమాకి కొనసాగింపుగా ‘మ్యాడ్‌ మాక్స్‌’ పట్టాలెక్కుతోంది. పొరుగు భాషల నుంచేమో ‘భారతీయుడు 2’, ‘కాంతార 2’ చిత్రాలు ఊరిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొనసాగింపు ఆలోచన కూడా ఉందని ఇదివరకే దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. సీక్వెల్‌ అంటే ఇన్నాళ్లూ రెండో భాగం సినిమానే. కానీ ఇప్పుడు మూడు భాగాలుగానూ కథల్ని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు దర్శకులు. ‘పుష్ప 3’, ‘కె.జి.ఎఫ్‌ 3’, ‘టిల్లు క్యూబ్‌’, ‘కార్తికేయ 3’ తదితర చిత్రాల కోసం కథలు సిద్ధం అవుతున్నాయి.


రచనే బలం

తొలి భాగం సినిమా ఫలితాన్ని, మార్కెట్‌ని సొమ్ము చేసుకుందాం అన్నట్టుగా కాకుండా కొనసాగింపు కథలపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ రంగంలోకి దిగుతున్నారు సినీ రూపకర్తలు. ప్రేక్షకుల్లో ఉండే అంచనాల్ని, తొలి భాగం సినిమాల్లో ప్రభావం చూపించిన విషయాల్ని అర్థం చేసుకుంటూ అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ ఉండేలా చూసుకుంటున్నారు. రచనలోని బలంతోనే కొనసాగింపు చిత్రాలు ప్రభావం చూపిస్తున్నాయి. మేకింగ్‌ హంగుల పరంగానూ తొలి భాగానికి దీటుగా ఉండేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాల్ని అందుకుంటున్నారు. ‘బాహుబలి’, ‘సలార్‌’, ‘పుష్ప’, ‘దేవర’ సినిమాలు మొదట ఒక కథగానే పట్టాలెక్కాయి. తీరా సెట్స్‌పైకి వెళ్లాక  అవి రెండు భాగాలుగా రూపాంతరం చెందాయి.  ‘పుష్ప3’ తరహాలో వీటిలో మిగిలిన సినిమాలూ మూడో భాగం కోసం సన్నద్ధమవుతాయేమో చూడాలి. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి - మహేశ్‌బాబు కలయికలో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా రూపొందే అవకాశాలున్నట్టు సమాచారం. మొత్తంగా భవిష్యత్తులో మరిన్ని కొనసాగింపులు ప్రేక్షకుల్ని మురిపించేందుకు వడి వడిగా ముస్తాబవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని