tollywood: కథలు కుదిరే... కలయికలు మిగిలే!

చేతి నిండా చిత్రాలున్నా మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు.. డైరీ ఖాళీ అయ్యేలోపు మరో కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేట సాగిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే కథలు, కలయికలు పక్కా చేసుకున్నట్లు సమాచారం అందుతుండగా.. మరికొన్ని కలయికలు, చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 10 Feb 2024 09:37 IST

చేతి నిండా చిత్రాలున్నా మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు.. డైరీ ఖాళీ అయ్యేలోపు మరో కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేట సాగిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే కథలు, కలయికలు పక్కా చేసుకున్నట్లు సమాచారం అందుతుండగా.. మరికొన్ని కలయికలు, చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వాటి కబుర్లు మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

కథానాయకుడు శర్వానంద్‌ నుంచి గతేడాది ఒక్క చిత్రమూ బయటకు రాలేదు. అలాగని తనేం ఖాళీగా లేరు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ప్రస్తుతం అది ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత శర్వా దర్శకులు రామ్‌ అబ్బరాజు, కల్యాణ్‌ శంకర్‌లతో సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఇప్పుడాయన నుంచి మరో కొత్త కబురు రానున్నట్లు తెలుస్తోంది. ‘లూజర్‌’ సిరీస్‌తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని మెప్పించిన అభిలాష్‌రెడ్డితో శర్వానంద్‌ ఓ చిత్రం చేయనున్నారని టాక్‌. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. దీన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథానాయికగా మాళవిక నాయర్‌ పేరు ప్రచారంలో ఉంది. ఈటీవీ విన్‌ వేదికగా విడుదలైన ‘చి90×(’ వెబ్‌సిరీస్‌తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించారు ఆదిత్య హాసన్‌. ఇప్పుడాయన వెండితెరపై తొలి అడుగు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తను కథానాయకుడు నితిన్‌ కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ విషయంపై ఇరువురికి మధ్య పలుమార్లు చర్చలు పూర్తయ్యాయి. దీన్ని నితిన్‌ సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నితిన్‌ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్‌’ అనే చిత్రం చేస్తున్నారు. దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

నాని మాఫియా... రానా లీడర్‌ 2

‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరుమీదున్నారు నాని. ఆయన ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత నానితో కలిసి పని చేసేందుకు దర్శకులు వేణు యెల్దండి, శ్రీకాంత్‌ ఓదెల కథలతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో మరో యువ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఆయనే సుజీత్‌. ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌తో ‘ఓజీ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడిదే నిర్మాణ సంస్థలో నాని - సుజీత్‌ కలయికలో ఓ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైందని.. ఇది మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది.  దర్శకుడు శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం ధనుష్‌ - నాగార్జునలతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఏషియన్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. అదే నిర్మాణ సంస్థలో శేఖర్‌ తన తదుపరి చిత్రాన్ని కూడా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంట్లో రానా కథానాయకుడిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వీళ్లిద్దరి కలయికలో వచ్చి విజయవంతమైన సినిమా ‘లీడర్‌’కు సీక్వెల్‌గా ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రానా ప్రస్తుతం రజనీకాంత్‌ - టి.జె.జ్ఞానవేల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘వేట్టయన్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ సినిమా చేయనున్నారు.

యాక్షన్‌ నేపథ్యంలో

‘జిల్‌’ చిత్రంతో తొలి అడుగులోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. రెండో ప్రయత్నంలో ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’ చేయగా.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆయన నుంచి మరో కొత్త కబురు వినపడలేదు. అయితే ఇప్పుడాయన తన తదుపరి సినిమాని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ‘జిల్‌’తో తనని దర్శకుడిగా మార్చిన హీరో గోపీచంద్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందనుందని.. విదేశాల్లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరుపుకోనుందని తెలిసింది. దీన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ వేసవిలో చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు